ప్రతి చావుకు ఏదో ఒక షాకు కచ్చితంగా ఉంటుంది. అందుకే మనిషికి చావు అనేది ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. తాను బలి ఇచ్చిన మేకనే తన ప్రాణాలు తీస్తుందని ఆ వ్యక్తి ఊహించలేదు. స్థానికంగా ఉన్న ఓ ఆలయం వద్ద మేకను బలి ఇచ్చిన ఓ వ్యక్తి.. ఆ మేక మాంసంతో వంటకాలు చేయించి అక్కడికి వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు. తాను కూడా తిని తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఖోపాధామ్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న 50 ఏళ్ల బగార్ రాయ్ అనే వ్యక్తి తన కోరిక తీరితే మేకను బలి ఇస్తానని మొక్కుకున్నాడు. ఆ కోరిక నెరవేరడంతో మొక్కు ప్రకారం ఓ మేకను బలి ఇచ్చాడు. ఈ వేడుకకు స్థానికులను ఆహ్వానించాడు. ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశాడు. బలి ఇచ్చిన మేక మాంసంతో వంటకాలు చేయించాడు. అక్కడ వచ్చిన వారికి ఆ మేక మాంసంతో భోజనాలు పెట్టించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సంఘటన జరిగింది.
ఆ భోజనాల కార్యక్రమంలో భాగంగా తాను వారితో కలిసి భోజనం చేశాడు. తింటుండగా.. ఒక్కసారిగా గొంతులో మేక కన్ను ఇరుక్కు పోయింది. గొంతులోకి వెళ్లిన మేక కన్ను అటు.. లోపలికి గానీ ఇటు బయటకు గానీ రాకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో ఊపిరి తీసుకోవడం కూడా బగార్ రాయ్‌కి కష్టమైపోయింది. దీంతో అక్కడ ఉన్నవారు బగార్ రాయ్‌ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకుని బగార్ రాయ్ కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆ బగార్ రాయ్ చనిపోవడంతో.. బంధువుల రోదనలతో జిల్లా ఆస్పత్రి మారు మోగిపోయింది. దీంతో కోరిక తీరిందని ఘనంగా మొక్కు చెల్లించాలనుకున్న బగార్ రాయ్.. అదే వేడుకలో చనిపోవడంతో సంతోషం కాస్త ఆవిరై.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.