మహారాష్ట్రలో అదానీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీకి ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అదానీ ఎలక్ట్రిసిటీకి చెందిన ఓ భారీ బ్రిడ్జిని ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనానికి సంబంధించిన విషయం తెలుసుకుని పోలీసులు, స్థానికులు, అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం నోరెళ్లబెట్టింది. ఎందుకంటే ఎప్పుడూ రద్దీగా ఉండే మార్గంలో 90 అడుగుల పొడవు.. 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను దుండగులు చోరీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ కాలువపై ఈ ఇనుప వంతెనను అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 2022 జూన్ నెలలో ఒక తాత్కాలికంగా నిర్మించింది. అదానీ సంస్థకు చెందిన భారీ ఎలక్ట్రిక్ వైర్లను తరలించేందుకు ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అయితే తర్వాతి కాలంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో అదే కాలువపై మరో వంతెన నిర్మించారు. కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అదానీ సంస్థ నిర్మించిన ఆ ఇనుప వంతెన వినియోగంలో ఉండటం లేదు. దీంతో ఈ వంతెనను చోరీ చేయాలని నిందితులు భావించారు. అదను చూసి దాన్ని ఎత్తుకెళ్లి పోయారు.
అయితే ఈ వంతెనను ఎవరూ వినియోగించకపోవడంతో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ 6 వేల కిలోల బరువున్న ఈ వంతెన ఇటీవల మాయం అయింది. ఎప్పుడూ వాహనాలు, ప్రజలతో రద్దీగా ఉండే మలాడ్ ప్రాంతంలో ఈ బ్రిడ్జిని దొంగలు చోరీ చేయడంపై స్థానికులు, పోలీసులు, అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వంతెన దొంగతనానికి గురైనట్లు గుర్తించిన అదానీ సంస్థ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వంతెన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. దొంగతనం జరిగిన తీరు తెలుసుకుని నోరెళ్లబెట్టారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బ్రిడ్జిని వంతెనను ముక్కలుగా చేసినట్లు గుర్తించారు. అనంతరం ఆ ముక్కలను ఒక భారీ ట్రక్కులో అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నిందితుడు ఈ వంతెన నిర్మించినపుడు అదానీ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురు అతడికి సహకరించారని వెల్లడించారు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.