ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీలోకి చొరబడి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్న వ్యక్తి,,,బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఘటన

national |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 09:36 PM

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే ఎలా ఉంటాయి. రాష్ట్ర సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు, బిల్లులు, వాటి ఆమోదాలు.. బడ్జెట్ ప్రవేశ పెట్టడం వంటి తతంగాలు మొత్తం నడుస్తాయి. అయితే ఇటీవలి కాలంలో సభల్లో చర్చల కంటే ఘర్షణలు, సభ్యులు పరస్పరం తోసుకోవడం జరుగుతూనే ఉంటున్నాయి. ఇంకా కొంత మందైతే నిద్రపోతారు.. మరికొంత మంది పోర్న్ వీడియోలు చూస్తూ కూడా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఘటనలో ఓ ఆగంతకుడు వచ్చి దర్జాగా ఎమ్మెల్యేలు కూర్చునే సోఫాలో కూర్చున్నాడు. సభ జరుగుతుండగా.. వచ్చి తానూ ఓ శాసనసభ్యుడిగా ఓ 15 నిమిషాల పాటు సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే ఈ విషయాన్ని గుర్తించాడు. భద్రతా సిబ్బందికి సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక అసెంబ్లీలో చోటు చేసుకుంది. దీంతో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తొలిసారి సమావేశాలు నిర్వహిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చునే సోఫాలో కూర్చున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తి 15 నిమిషాల పాటు సీట్లోనే కూర్చున్నాడు. అయితే ఆ వ్యక్తి ఎమ్మెల్యే కాదని.. బయటి వ్యక్తి అని మరో ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 70 ఏళ్ల తిప్పే రుద్రప్పగా పోలీసులు గుర్తించారు. జేడీఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరియమ్మకు కేటాయించిన సీట్లో రుద్రప్ప కూర్చున్నాడు. అయితే అదే జేడీఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రుద్రప్పను గుర్తించడంతో విషయం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో మార్షల్స్‌ అతడిని బయటకు పంపించారు. అసెంబ్లీ విజిటర్స్‌ పాస్‌ ఉన్న రుద్రప్ప.. తాను ఎమ్మెల్యేనని చెప్పి సభ లోపలికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారి సమావేశాలు జరుగుతుండటంతో ఆయన కొత్త ఎమ్మెల్యే అనుకున్న మార్షల్స్‌.. అడ్డు చెప్పకుండా లోపలికి పంపించినట్లు తెలిపారు.


అయితే ఇలా భద్రతా నియమాలను ఉల్లంఘించి అసెంబ్లీలోకి వెళ్లిన రుద్రప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ.. భారీ భద్రతను ఛేదించుకుని ఓ ఆగంతకుడు సభలోకి వెళ్లడంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే రుద్రప్ప మానసిక స్థితిపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com