పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మరోసారి రణరంగంగా మారింది. వివిధ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఎన్నికల పోలింగ్ పత్రాలకు నిప్పంటించారు. తాజాగా చెలరేగిన ఘర్షణల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా వివిధ పార్టీలకు చెందినవారు, స్వతంత్ర అభ్యర్థి కూడా చనిపోయారు.
బెంగాల్‌లో తాజాగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా టీఎంసీ పార్టీ విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
ఎన్నికల పోలింగ్ వేళ.. రేజినగర్, తుపాన్‌గంజ్, ఖర్‌గ్రామ్ ప్రాంతాల్లో దిగ్భ్రాంతికర ఘటనలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. దోమ్‌కోల్‌లో మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఆ కేంద్ర బలగాలు ఏమయ్యాయని టీఎంసీ మండిపడింది.
శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, ఉద్రిక్తతలు జరుగుతూనే ఉన్నాయి. కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బ్యాలెట్ పత్రాలను కాల్చి వేశారు. రాణినగర్‌లో తృణముల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. డైమండ్ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ మొదలు కాకముందే బ్యాలెట్ బాక్సుల్లో కొంతమంది ఓట్లు వేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
జల్‌పాయ్‌గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి చేశారని టీఎంసీ ఆరోపించింది. ఘర్షణల నేపథ్యంలో బెంగాల్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల ఆంక్షలు విధించారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70 వేల మంది రాష్ట్ర పోలీసులు.. బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పంచాయతీ ఎన్నికల బరిలో మొత్తం 2.06 లక్షల మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా లైన్లలో నిలబడ్డారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018 లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34 శాతం సీట్లలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90 శాతం విజయం సాధించింది.