కర్ణాటక విధాన సౌధలో ఇటీవల ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే సీటులో కూర్చున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే కర్ణాటక అసెంబ్లీలోకి ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే, భద్రతా సిబ్బంది ఈ విషయం గుర్తించి వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విధాన సౌధ వద్ద చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసి.. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఎంట్రీ గేటు వద్ద తనఖీలు చేస్తుండగా ఓ మహిళ వద్ద కత్తి ని గుర్తించడం కలకలం రేపింది. తూర్పు ద్వారం నుంచి ఆ మహిళ లోపలికి వస్తుండగా అక్కడున్న సిబ్బంది ఆమెను తనిఖీలు చేశారు. ఆమె చేతిలోని బ్యాగ్‌ను స్కానర్‌లోకి పంపడంతో ప్రమాదకర వస్తువు ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. అందులో కత్తి బయటపడింది.
ఆ కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఆమె ఎవరు? కత్తి ఎందుకు తీసుకొచ్చింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఆమె అసెంబ్లీ ప్రాంగణంలోని ఓ విభాగంలో పనిచేసే సిబ్బంది అని కొన్ని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ అసెంబ్లీ పరిసరాలను పరిశీలిస్తున్నారు. అన్ని ప్రవేశ ద్వారాల వద్దకు వెళ్లి భద్రతను పర్యవేక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భద్రత గురించి ఈ రోజు తనిఖీలు చేశాను.. విధాన సౌధ ప్రతి ఒక్కరికీ సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. విధాన సౌధకు చాలా మంది వస్తుంటారు.. పనులు సజావుగా సాగేలా నేను ప్రయత్నిస్తున్నాను’ అని స్పీకర్ అన్నారు.
గతవారం ఓ వ్యక్తి దర్జాగా సభలో ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మకు కేటాయించిన స్థానంలో గుర్తుతెలియని వ్యక్తి కూర్చున్నట్లు అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే శరణా గౌడ కందుకూర్ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడంతో మార్షల్స్ అతడిని బయటకు పంపేశారు. ఆ వ్యక్తిని 72 ఏళ్ల తిప్పే రుద్రప్పగా గుర్తించారు. విజిటర్స్ పాస్‌తో వచ్చిన అతడు.. తాను ఎమ్మెల్యేనని చెప్పి లోపలకు ప్రవేశించినట్టు పోలీసులు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్ సైతం అడ్డుచెప్పకపోవడంతో అసెంబ్లీలోకి ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడని వివరించారు. రుద్రప్పపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే శరణా గౌడ మాట్లాడుతూ... ‘నేను ఆ వ్యక్తిని సభలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు... కాబట్టి నేను హున్సూరు ఎమ్మెల్యే హరీష్ గౌడ్‌ను అడిగాను. గౌడ కూడా ఇంతకు ముందు చూడలేదని చెప్పాడు.. నాకు అనుమానం వచ్చి మార్షల్‌కి సమాచారం ఇచ్చాను.. తాను మొల్కాల్మూరు ఎమ్మెల్యేనని మార్షల్‌కు ఆ వ్యక్తి చెప్పినట్లు తేలింది.. మొల్కాల్మూరు ఎమ్మెల్యే (కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌వై గోపాలకృష్ణ) సభలో అందరికీ తెలిసిన సీనియర్ వ్యక్తి కావడంతో నా అనుమానం మరింత పెరిగింది’ అని తెలిపారు.