గడచిన మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఉత్తర భారతం చిగురుటాకులా వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు దెబ్బతిని, పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమున సహా పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. హరియాణా ప్రభుత్వం యమునా నదిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టడంతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.
వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్ లో 17.. యూపీ, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ఈ భారీ వర్షాలకు పశ్చిమ ప్రాంతం మీదుగా వీచే గాలులు, రుతుపవనాల కలయికే కారణమని ఐఎండీ పేర్కొంది.
జులై మొదటి వారంలో వాయువ్య భారతదేశంలో కురిసిన వర్షపాతం మొత్తం దేశానికి లోటును భర్తీ చేసిందని ఐఎండీ తెలిపింది. జులైలో ఇప్పటి వరకూ 243.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. ఇది సాధారణం కంటే 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువని ఐఎండీ పేర్కొంది. జూన్‌లో 148 మి.మీ. వర్షపాతం నమోదకాగా.. సాధారణం కంటే ఇది 10 శాతం తక్కువ. కేంద్ర జల సంఘం ప్రకారం.. దేశంలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయి. అయితే, జులై నెలలో సాధారణ వర్షపాతం ఉంటుంది ఐఎండీ ముందస్తు అంచనాల్లో పేర్కొనడం గమనార్హం.
ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదిని దాటి అవతలి వైపు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భారీ ఇనుప వంతెన కూలి, వరద నీటిలో పడి కొట్టుకుపోయిన దృశ్యాలను ఓ యూట్యూబర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.