దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.200కు చేరడంతో సామాన్యులు జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో టమాటాలను సైతం దొంగలించడానికి కొందరు వెనుకాడటం లేదు. గతవారం కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఓ కూరగాయల వ్యాపారి.. తన దుకాణం వద్ద ఇద్దరు బౌన్సర్లు నియమించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి.
వారణాసి నగరం లంక ప్రాంతానికి చెందిన అజయ్ ఫౌజీ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఆయన తన దుకాణం వద్ద ఇద్దరు బౌన్సర్లను నియమించకున్నారు. గత కొన్నిరోజులుగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వాటిని కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్ల దూకుడును అడ్డుకునేందుకే ఇలా చేసినట్లు చెప్పారు. అయితే, ఫౌజీ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త కావడంతో ధరల పెరుగుదలపై ఇలా వ్యంగ్యంగా నిరసన తెలుపుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అజయ్ టమాటా ఆకృతిలో ఉన్న కేకును సైతం కట్ చేయడం విశేషం.
అంతేకాదు, కేంద్రంలోని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో నిత్యావసర ధరలు పెరుగుదలను తెలిపే ప్లకార్డును సైతం ఫౌజీ తన దుకాణం వద్ద ఏర్పాటు చేశారు. కిలో టమాటా రూ.140 నుంచి రూ.160 వరకు అమ్ముతున్నట్టు ఫౌజీ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దుకాణం వద్ద బౌన్సర్లు కాపలా కాస్తున్నారు. అయితే, వీరికి ఎంత చెల్లిస్తున్నారని ఫౌజీని ప్రశ్నించగా.. ఎవరూ ఊరికే పని చేయరు కదా అని సమాధానం దాటవేశారు. కాగా, తమ పార్టీ కార్యకర్త షాపు ముందు బౌన్సర్ల ఏర్పాటు వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన అఖిలేశ్ యాదవ్.. ‘‘బీజేపీ ప్రభుత్వం టమాటాలకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలి’’ అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.