ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 కి.మీ. ప్రయాణానికి రూ.300 చెల్లించిన బెంగళూరు వ్యక్తి,,,మీ నగరంలో ఛార్జీలు ఎలా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆరా

national |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 09:56 PM

పదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. ఆటోలు, ట్యాక్సీలు, బస్సు ఛార్జీల ధరలు కూడా అదే రీతిలో పెరిగాయి. దీంతో ప్రయాణాలకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. బస్సు ఛార్జీలు బాగా పెరిగిపోగా.. లాక్‌డౌన్ తర్వాత రైలు ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. సిటీల్లోనూ ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడానికి ఆటోవాలాలు గతంతో పోలిస్తే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇక డిమాండ్, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో అయితే సిటీల్లో ఆటోలు, క్యాబ్‌ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంతలా అంటే.. రెండు కిలోమీటర్ల ఆటో ప్రయాణానికి రూ.300 వసూలు చేసేంత.


ఏంటి.. రెండు కిలోమీటర్లు ఆటోలో వెళ్లడానికి మూడొందల రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే.. బెంగళూరుకు చెందిన రవి సుతంజని అనే వ్యక్తి రెండు కి.మీ. ఆటోలో వెళ్లడానికి రూ.300 చెల్లించానని చెప్పాడు. మీ నగరంలో సాధారణంగా రేట్లు ఎలా ఉంటాయని ట్విట్టర్ వేదికగా తోటి నెటిజన్లను ప్రశ్నించాడు.


రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సింది కదా.. రూ.300 అంటే చాలా ఎక్కువ చెల్లించారని నెటిజన్లు సమాధానం ఇచ్చారు. దీనికి రవి స్పందిస్తూ.. నేను గత ఆరు నెలలుగా రోజుకు సగటున 4 కిలోమీటర్లు నడుస్తున్నా, నడవడంలో ఇబ్బందేమీ లేదు గానీ.. అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది అందుకే నడవడం కుదర్లేదన్నాడు. 2 కి.మీ.కు 30 రూపాయలే తీసుకుంటారు. కానీ మిమ్మల్ని దోచుకున్నారని ఓ నెటిజను చెప్పగా.. అవును నిజమే.. ముగ్గురు నలుగురు ఆటోవాలాలను అడిగాను. వాళ్లు కూడా అంతే అడిగారు అని రవి బదులిచ్చారు.


మా ఊళ్లో అయితే 2 కి.మీ. రూ.500 తీసుకుంటారని ఓ నెటిజన్ బదులివ్వగా.. ఎక్కడ నాయనా అని మిగతా వాళ్లు ప్రశ్నించారు. దీనికి అతడు బదులిస్తూ.. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉంటున్నానని చెప్పాడు. అంటే యూరోప్‌లో ఉన్న ప్రయాణ ఛార్జీలు మన బెంగళూరులో ఉన్నాయన్నమాట. మా సూరత్‌లో అయితే 2 కి.మీ.కు ఐదు రూపాయలే ఇస్తాం తెలుసా..? అని ఓ వ్యక్తి డబ్బా కొట్టుకోపోయాడు. సూరత్‌కే చెందిన మరో వ్యక్తి స్పందిస్తూ.. బాబూ.. నేను కూడా సూరత్‌లోనే ఉంటున్నా. నువ్వు చెప్పేది తప్పు. కనీస ప్రయాణ ఛార్జీనే రూ.10 నుంచి మొదలవుతుంది. 2 కిలోమీటర్లు షేర్ ఆటోలో వెళ్లడానికి రూ.10-15 వసూలు చేస్తారని వివరణ ఇచ్చాడు.


ఉబెర్, ఓలా ట్రై చేయకపోయారా..? లేదంటే బెంగళూరు ఆటోవాలాలు ప్రారంభించిన ‘నమ్మ యాత్రి’ సర్వీస్‌ను వాడుకోకపోయారా..? అంటూ నెటిజన్లు అతడికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. కొంపదీసి నువ్వు టమాటాలు కొనడానికి ఆ ఆటోలు వెళ్లలేదు కదా..? అంటూ సెటైరికల్‌గా స్పందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com