అమరావతి రాజధాని వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాజధాని వ్యవహారంపై దాఖలైన ఈ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ లాయర్ కేకే వేణగోపాల్ సుప్రీంను కోరగా.. . ఆగస్ట్ నుంచి నవంబర్ వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని తెలిపింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం వెల్లడించింది. డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యంకాదని సుప్రీం స్పష్టం చేసింది.
మరోవైపు అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు మూడు గంటల సమయం కావాలని ప్రభుత్వ తరఫు లాయర్ కేకే వేణుగోపాల్ కోరారు. ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని అమరావతి రైతుల తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది.. చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించినట్టయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్టేనని వెల్లడించింది. అయితే మరికొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతుల తరఫు లాయర్లు చెప్పగా.. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా పడటంతో విశాఖకు రాజధాని తరలింపుపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని ప్రకటించారు. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని తేల్చి చెప్పారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని.. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య ఎలాంటి వైషమ్యాలు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అన్ని జిల్లాల అభివృద్ధి, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ తపన అన్నారు.
మరోవైపు రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశాల కేసులను విడదీసి ఆర్- 5 జోన్ పిటిషన్లపైనే విచారించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్- 5 జోన్ కేసుల విచారణను త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు అప్పగించింది. అనంతరం విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.