ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలపై విరిగిపడ్డ కొండచరియలు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 09:33 PM

విశాఖపట్నం నుంచి అరకు మార్గంలో 82వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైళ్లను రద్దు చేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం - అరకు మార్గంలో రైలు పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ముందుగానే గ్రహించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్తవలస –కిరండూల్‌ రైల్వే లైన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో సోమవారం (జూలై 10) సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొర్రా, కరకవలస మధ్య (82వ కిలోమీటర్‌ వద్ద) కొండ చరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి రైల్వే లైన్‌పై పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొంత మంది తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు.


బండరాళ్లు విరిగిపడటంతో ఓహెచ్‌సీ విద్యుత్‌ స్తంభం విరిగిపోయింది, రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కేకే లైన్‌లో రెండో లైన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు పూర్తిగా దెబ్బతినడంతో రైల్వే అధికారులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. విద్యుత్‌ సాంకేతిక సమస్య కారణంగా విశాఖపట్నం వెళుతున్న కిరండూల్‌ ప్యాసింజర్‌ రైలును కొంతసేపు బొర్రా రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం కిరండూల్‌ పాసింజర్‌ రైలు విశాఖపట్నం బయల్దేరింది. కోరాపుట్, దమంజోడి, రాయగడ, విజయనగరం మీదుగా దీన్ని విశాఖపట్నం పంపించినట్లు సీనియర్‌ డివిజన్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సోమవారం రాత్రి విశాఖ నుంచి కిరండూల్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు. కిరండూల్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి కిరండూల్‌ వెళ్లే ప్యాసింజర్ రైళ్లను 3 రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com