రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చేసిన చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటైన, నిర్మాణంలో ఉన్న, రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సూచించారు. చట్టం అమలు జరుగుతోన్న తీరుపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని.. ప్రతి 6 నెలలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే సంస్థలు ఏవైనా.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశం దృష్ట్యా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తీసుకొచ్చిన ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు.