ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన టికెట్లు క్యాన్సిల్ చేసుకుని,,,రీఫండ్ చూసి ఖంగుతిన్న ఐఏఎస్ ఆఫీసర్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 08:46 PM

మనలో చాలా మంది తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రైళ్లు, విమానాలు అయితే చాలా ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. రైళ్లలో అయితే అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకోవాలంటే చాలా తలనొప్పి. ఇక విమనాల్లో అయితే ఎంత తొందరగా టికెట్లు బుక్ చేసుకుంటే అంత తక్కువలో టికెట్ లభిస్తూ ఉంటుంది. అయితే బుక్ చేసుకున్న రోజున లేదా సమయానికి ఏదైనా అర్జెంటు పని ఉంటే చివరి నిమిషం వరకు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే దానికి కొంత ఛార్జీలు కూడా వర్తిస్తాయి. అయితే ఒక్కోసారి ఆ రీఫండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని.. ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం మనం చాలాసార్లు చూస్తుంటాం. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఓ ఐఏఎస్ అధికారి.. విమాన టికెట్‌ను బుక్ చేసుకుని తర్వాత వేరే పని కారణంగా దాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో సదరు విమానయాన సంస్థ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల కింద భారీగా కోత విధించింది.


బిహార్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్ కుమార్ ఒక విమాన టికెట్‌ను కొనుగోలు చేశారు. దానికి రూ. 13,820 ఖర్చు అయింది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ విమాన టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే విమాన ప్రయాణానికి టికెట్ ఛార్జీ రూ. 14,158 కాగా.. జీఐ కన్వీనెన్స్ ఫీజు మరో రూ.800. కూపన్ ద్వారా టికెట్ బుక్ చేయడంతో రూ.1,138 డిస్కౌంట్ కూడా లభించింది. అయితే ఈ విమాన టికెట్‌ను రద్దు చేసిన రాహుల్ కుమార్‌కు వచ్చిన రీఫండ్ అమౌంట్ చూసి ఆయన షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు వచ్చింది కేవలం రూ.20. విమాన టికెట్ కోసం రూ.13,820 ఖర్చు పెడితే కేవలం రూ.20 రావడంతో ఖంగుతిన్న రాహుల్ కుమార్.. దీనికి సంబంధించిన ఆధారాలతో ఆయన ట్విట్ చేశారు.


అయితే టికెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన వివరాల్లో దేనికి ఎంత కట్ చేశారన్నది స్పష్టంగా సదరు ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడించింది. అందులో టికెట్ క్యాన్సలేషన్ ఫీజు కింద రూ.11,800 కోత విధించారు. జీఐ క్యాన్సలేషన్ ఫీజు అని మరో రూ.1,200.. జీఐ కన్వీనెన్స్ ఫీజు రూ.800.. రాహుల్ కుమార్ చెల్లించిన మొత్తం ఛార్జీ నుంచి మినహాయించారు. దీంతో ఆయన ఖాతాలో రూ.20 రీఫండ్ అమౌంట్ వచ్చింది. అంటే రూ.13,820 తో విమాన టికెట్ బుక్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో రూ.13,800 కట్ అయి.. కేవలం రూ.20 అకౌంట్‌లో పడ్డాయి.


ఈ క్రమంలోనే ఐఏఎస్ రాహుల్ కుమార్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వచ్చిన రూ.20 విషయంలో కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ఈ రూ. 20 తో ఎందులో పెట్టుబడులు పెట్టాలి అంటూ నెటిజన్లను అడుగుతూ రాహుల్ కుమార్ అడిగారు. మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని.. సెటైరికల్‌గా ఓ ప్రశ్న వేశారు. దీనికి నెటిజన్ల నుంచి ఫన్నీ రిప్లైలు వచ్చాయి. మీకు వచ్చిన రూ.20 ను ఎవరికైనా విరాళంగా ఇచ్చి.. దాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రిటర్న్స్‌లో క్లెయిమ్ చేసుకోండి అని సూచించారు. మీకు వచ్చిన రూ. 20తో స్టాక్‌ మార్కెట్లలో యెస్ బ్యాంక్ లేదా వొడాఫోన్ ఐడియాకు చెందిన షేర్లు కొనవచ్చని సరదాగా సూచనలు ఇచ్చారు. అయితే ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురయ్యాయని పలువురు నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు టికెట్ రద్దు చేసుకున్నపుడు.. ఆయా సంస్థలు రీఫండ్ వేసే సమయంలో భారీగా ఛార్జీలు వడ్డిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com