ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి. అబ్బో చెప్తే లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో.. వివిధ రకాలైన స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాత్రం ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఠక్కున చెప్పే వంటకం పానీపూరీ. దీన్ని ఉత్తర భారతదేశంలో అయితే గోల్ గప్పా అని.. ఇక దక్షిణ భారత దేశంలో అయితే పానీ పూరీ అని పిలుస్తారు. ఇక ఈ పానీ పూరీ బండి వద్ద ఎప్పుడు చూసినా జనం గుమిగూడి ఉంటారు. అక్కడ వీటిని తినేందుకు పానీపూరీ లవర్స్ ఎగబడి పోతారు. ఇలాంటి ఎంతో చరిత్ర ఉన్న పానీపూరీ.. గల్లీ స్థాయి నుంచి గూగుల్ స్థాయికి వెళ్లింది.
మనకు ఏదైనా ఇంటర్నెట్ కావాలంటే గూగుల్ ఓపెన్ చేస్తాం. అయితే గూగుల్ ఓపెన్ చేయగానే అక్కడ మనకు గూగుల్ అని ఇంగ్లీష్ అక్షరాలతో ఒక డూడుల్ కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఏదైనా ముఖ్యమైన రోజు అయితే.. గూగుల్ సంస్థ దానికి గౌరవంగా డూడుల్‌ను మార్చుతుంది. అయితే ఇవాళ అంటే బుధవారం ( 12 జులై 2023) రోజున గూగుల్ డూడుల్ స్థానంలో పానీపూరీ దర్శనమిచ్చింది. దీంతో పానీపూరీ లవర్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీని గూగుల్ గుర్తించి.. డూడుల్‌గా పెట్టడం భారతీయ వంటకానికి దక్కిన అరుదైన గౌరవం అని నెటిజన్లు, ముఖ్యంగా పానీపూరీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పానీపూరీ తినేవారికి ఆనందం ఇస్తుంటే.. ఎంతో మంది చిరువ్యాపారులకు జీవనోపాధిని కల్పిస్తోంది.
సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు పానీపూరీ ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2015 జులై 12 వ తేదీన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఒక రెస్టారెంట్ 51 రకాలైన రుచికరమైన పానీపూరీలను తయారు చేసింది. దీంతో పానీపూరీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డు సాధించిన 8 ఏళ్ల తర్వాత దాన్ని గుర్తు చేస్తూ.. గూగుల్ పానీపూరీ డూడుల్‌ను పెట్టింది. పానీపూరీకి వరల్డ్ రికార్డ్ సాధించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పానీపూరీ గేమ్‌ను గూగుల్ తన డూడుల్‌లో తీసుకువచ్చింది. దీంతో ఈ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ విశిష్టత విశ్వ వ్యాప్తం అయింది. ఈ గేమ్ సౌండ్ ఎఫెక్ట్లతో గేమర్స్‌ను బాగా ఆకర్షిస్తోంది. అచ్చం క్యాండీ క్రష్ లాంటి మరో ఆటను కూడా గూగుల్ డూడుల్ ఏర్పాటు చేసింది.