ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని పార్టీలకూ మొత్తం రూ.16,437 కోట్లు విరాళాలు,,,రెండు, మూడు స్థానంలో నిలిచిన కాంగ్రెస్, టీఎంసీ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 08:55 PM

రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో సగానికి పైగా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వస్తున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌  నివేదిక వెల్లడించింది. 2016-17 నుంచి 2021-22 మధ్య ఆరేళ్లలో ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు రూ.16,437 కోట్ల విరాళాలు రాగా.. వీటిలో రూ.9,188 కోట్లు కేవలం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. ఈ విషయంలో ఇతర పార్టీల కంటే రూ.10,122 కోట్లతో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌ (రూ.1,547కోట్లు), తృణమూల్‌ కాంగ్రెస్‌  (రూ.823 కోట్లు) ఉన్నాయని నివేదిక పేర్కొంది.


బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో సగానికి పైగా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో.. 32 శాతం కార్పొరేట్‌ సంస్థల ద్వారా లభించాయి. కాంగ్రెస్‌కు బాండ్ల రూపంలో రూ.952.29 కోట్లు (61.54 శాతం), టీఎంసీకి రూ.767.88 కోట్లు (93.27 శాతం) వచ్చాయి. అలాగే, రాజకీయ పార్టీల మొత్తం విరాళాల్లో 80 శాతం జాతీయ పార్టీలకు.. 19.75 శాతం విరాళాలు ప్రాంతీయ పార్టీలకు వచ్చినట్లు ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. ఇక, ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే బీజేడీ (బిజూ జనతాదళ్)కి అత్యధికంగా రూ.622 కోట్లు వచ్చాయి. అందులో 89.8 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. తర్వాతి స్థానాల్లో డీఎంకే (రూ.431 కోట్లు), బీఆర్ఎస్ (రూ.383 కోట్లు), వైఎస్సార్సీ (రూ.330 కోట్లు) లు నిలిచాయి.


ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు మొత్తంగా వచ్చిన విరాళాల్లో రూ.4,614 కోట్లు (28శాతం) కార్పొరేట్‌ రంగం.. రూ.2,634 కోట్లు (16శాతం) ఇతర వనరుల ద్వారా సమకూరాయి. ఈ ఆరేళ్లలో ప్రాంతీయ పార్టీల కార్పొరేట్‌ విరాళాలు 152% మేర పెరిగాయని వెల్లడించింది. ఈ ఆరేళ్ల కాలంలో అత్యధికంగా రూ.4,863 కోట్ల విరాళాలు 2019-20 సాధారణ ఎన్నికల సమయంలోనే వచ్చాయని చెప్పింది. తర్వాత 2018-19లో రూ.4,041 కోట్లు, 2021-22లో రూ.3,826 కోట్ల విరాళాలుగా వచ్చాయి. బీఎస్పీ, సీపీఐలకు 100 శాతం ఇతర వనరుల ద్వారా విరాళాలు అందాయి. రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో రూ.20వేల కంటే తక్కువ ఉంటే దాతలకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు.


అంతకు ముందు ప్రకటించిన నివేదికలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీకి భారీగా విరాళాలు అందినట్లు ఏడీఆర్ తెలిపింది. 2021-22 మధ్య దేశంలోని ప్రాంతీయ పార్టీలలో డీఎంకే పార్టీ రూ.318 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో నిలిచింది. రూ.307 కోట్లతో ఒడిశాకు చెందిన బీజేడీ(బిజూ జనతా దళ్), రూ. 218 కోట్లతో బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశంలోని 10 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా.. రూ.852 కోట్ల విరాళాలు వచ్చినట్టు.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) గణాంకాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com