ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకు గురైన ఇందిరా గాంధీకి ఎయిమ్స్‌లో చికిత్స,,తన పుస్తకంలో నాటి సంఘటనను వివరించిన వైద్యుడు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 08:57 PM

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజున ఆమె చివరి క్షణాల్లో జరిగిన సంఘటనల గురించి ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ పి. వేణుగోపాల్ ఇటీవల విడుదలైన తన పుస్తకంలో వివరించారు. శరీరమంతా తూట్లుపడి బుల్లెట్లతో నిండిపోయిన ఇందిరా గాంధీ.. ఆసుపత్రి బెడ్‌పై పడి ఉండటాన్ని చూసి భయంతో వణికిపోయానని ఆయన తెలిపారు. ఇందిరపై ఆమె వ్యక్తిగత సంరక్షులు 1984 అక్టోబరు 31న విచక్షణరహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇందిరా గాంధీని చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు. ఈ సమయంలో జరిగిన సంఘటనల గురించి డాక్టర్ వేణుగోపాల్ తన ‘హార్ట్‌ఫెల్ట్‌’  పుస్తకంలో వివరించారు. ఇందిర హత్యకు గురయ్యే సమయానికి డాక్టర్ వేణుగోపాల్ కార్డియాక్ సర్జరీ విభాగం చీఫ్‌గా ఉన్నారు. దేశంలో తొలిసారి 1994లో గుండెమార్పిడి శస్త్ర చికిత్సను ఈయనే చేశారు.


ఇందిరను ఆసుపత్రికి తరలించిన తర్వాత నాలుగు గంటల్లో ఏం జరిగిందో కూలంకషంగా ఆయన వివరించారు. ‘వంటి నిండా బుల్లెట్‌ గాయాలతో ఉన్న ఇందిరా గాంధీని ఎయిమ్స్‌కి తీసుకొచ్చారు. ఆసుపత్రి ఫ్లోర్‌పై బుల్లెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆమె శరీరం నుంచి రక్తం ధారలా కారుతోంది.. పొట్టలోంచి ఉబికివస్తోన్న రక్తంతో ఆమె ఒంటిపై ఉన్న చీర తడిసిపోయింది.. ఆమెను కాపాడటానికి నాలుగు గంటలపాటు వైద్యులు, సర్జన్లు, నర్సింగ్‌ స్టాఫ్‌ తీవ్రంగా శ్రమించారు. ఆమెకు ఓ నెగిటివ్‌ రక్తాన్ని ఎక్కించడానికి ఒకవైపు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆసుపత్రి కారిడార్‌లో తదుపరి ప్రధాని ఎవరు.. ఎప్పుడు ప్రమాణం చేయాలనే రాజకీయ చర్చలు జరుగుతున్నాయి... నేను తక్షణమే పదవీ విరమణ చేయబోతున్న ఎయిమ్స్ డైరెక్టర్‌ టాండన్‌, కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న స్నేహ్‌ భార్గవ్‌ వద్దకు వెళ్లా. వారిద్దరూ నిస్సహాయంగా నా వైపు సలహా కోసం చూశారు.


కార్డియాక్‌ సర్జరీ చీఫ్‌గా నేను అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. వెంటనే రక్తస్రావాన్ని ఆపాలని సూచించా.. కనీసం ఆథరైజేషన్ సంతకం కోసం కూడా నేను ఆగలేదు.. వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తరలించాలని ఆదేశించాను.. ఇందిరను బైపాస్‌ యంత్రంపై ఉంచి.. బుల్లెట్లతో నిండిపోయిన ఆమె పొట్ట భాగంలో రక్తస్రావాన్ని ఆపాలనేది ప్లాన్.. ఇందుకోసం 4 గంటలపాటు శ్రమించాం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బైపాస్‌ చేయడానికి వైద్యులు ప్రయత్నించారు. కానీ కాపాడలేకపోయాం.. ఆమె మరణవార్తను కుమారుడు రాజీవ్‌ గాంధీకి (Rajiv Gandhi) చెప్పడానికి బయటకు వచ్చినప్పుడు నాకు నోటివెంట మాటలు రాలేదు.. కడుపులో పేగులు మెలితిరిగిపోయాయి’ అని వేణుగోపాల్‌ పుస్తకంలో వివరించారు.


‘హార్ట్‌ఫెల్ట్‌: ఏ కార్డియాక్‌ సర్జన్స్‌ పయనీరింగ్‌ జర్నీ’ పేరుతో వేణుగోపాల్‌ తన సతీమణి ప్రియా సర్కార్‌తో కలిసి రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్‌ కొలిన్స్‌ ఇండియా సంస్థ ప్రచురించింది. కాల్పులు జరిపిన వెంటనే ఇందిరను పక్కకు లాగి ఉంటే రెండు బుల్లెట్ గాయాలతో బయటపడేది.. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆమె మొదటి బుల్లెట్‌కు కింద పడిపోయారు.. ఇంతలో ఆమెతో పాటు ఉన్న వ్యక్తులు ఇందిరను ఒంటిరిగా వదిలేసి పారిపోయారు.. ఇది హంతకులకు మరింత అవకాశం ఇచ్చింది.. మెషిన్ గన్‌తో అనేక రౌండ్లు కాల్పులు జరిపి శరీరాన్ని చిధ్రం చేశారు’ అని ఆయన చెప్పారు.


ఆ సమయంలో జరుగుతోన్న రాజకీయ చర్చలు గురించి కూడా పుస్తకంలో వివరించిన ఆయన.. మూగ ప్రేక్షకుడిలా వాటి వింటూ ఉండిపోయానని చెప్పారు. ‘ప్రధాన చర్చ ఏమిటంటే రాష్ట్రపతి (జ్ఞానీ జైల్ సింగ్) రాజీవ్ గాంధీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలి.. గాంధీ సన్నిహితుడు అరుణ్ నెహ్రూతో చర్చ జరిగింది.. రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఉండటంతో ప్రమాణస్వీకారం ఉపరాష్ట్రపతి (ఆర్ వెంకటరామన్) చేయించవచ్చా.. అది సరికాదని మరో వర్గం భావించింది. విషయాలు ఈ విధంగా ముందుకు వెనుకకు సాగాయి.. ’అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com