ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల్లో చిక్కుకున్న 28 మంది.. ఎన్డీఆర్ఎఫ్ సాహసోపేత రెస్క్యూ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 10:03 PM

కుండపోత వర్షాలు హిమాచల్‌ ప్రదేశ్‌‌లో బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ రహదారులు, నివాసాలు కొట్టుకుపోయి.. కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుపు వరదలతో దాదాపు 1,100 రహదారులు మూసుకుపోయి.. వేలాది మంది పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బాధితులకు కొన్ని హోటళ్లు ఉచితంగా వసతి సౌకర్యం కల్పించాయి. మూడు రోజుల్లో కులు, మనాలీ నుంచి 25,000 మంది పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ఈ క్రమంలో కిన్నౌర్ జిల్లాలో చిక్కుకున్న 28 మంది గొర్రెల కాపర్లు, పర్వాతారోహకులను రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం  సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌కు చెందిన సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కఫ్నూ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో 11 మంది చిక్కుకున్నారు. జూలై 10నజాతీయ విపత్తు నిర్వహణ దళం బృందం, ఐటీబీపీ, హోంగార్డ్ సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రహదారి అడ్డంకులను అధిగమించి, స్థానిక పాఠశాలలో వీరంతా రాత్రిపూట బస చేసింది.


మర్నాడు భారీ వర్షం కురుస్తున్నా ములింగ్‌కు చేరుకుని, నదికి అవతలివైపున చిక్కుకున్నవారి వద్దకు తాళ్ల సాయంతో వెళ్లి భరోసా ఇచ్చారు. జులై 12న జాతీయ విపత్తు నిర్వహణ దళం ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ నేగి నేతృత్వంలో జాయింట్ రెస్క్యూ టీమ్ మొత్తం 28 మందిని విజయవంతంగా రక్షించింది. సవాల్‌గా తీసుకున్న రెస్క్యూ టీం.. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అసమాన ధైర్యం, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించింది.


పర్యాటకుల్ని ఖాళీ చేయించడం క్లిష్టతరంగా మారిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ సుక్కు చెప్పారు. కొండచరియలు విరిగిపడడం, మెరుపు వరదల వల్ల రెండ్రోజులుగా నిలిచిపోయిన 300 వాహనాలు ఎట్టకేలకు ముందుకు కదులుతున్నాయి. కాసోల్‌లో ఉన్న 2 వేల మందిని విజయవంతంగా తరలించారు. వీరిలో 52 మంది విద్యార్థులు, 100 మంది పర్వతారోహకులు ఉన్నారు. ఏడుగురు పర్వతారోహకుల్ని ఐఏఎఫ్ బృందం రక్షించింది. పలుప్రాంతాల్లో పెద్దఎత్తున మంచు కురుస్తూ రోడ్డుమార్గాలను మూసేస్తోంది. మంచును తొలగించే పనులను సిబ్బంది చేపట్టారు.


కాగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు జులై 14 నుంచి మరో నాలుగైదు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో హిమాచల్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ‘నేడు, రేపు వర్షాల తీవ్రత తక్కువగా ఉంటుంది. రుతుపవనాలు కొంచెం బలహీనంగా మారతాయి హిమాచల్ ప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.. ఏది ఏమైనప్పటికీ, జూలై 14 నుంచి రుతుపవనాలు మరోసారి తీవ్రమవుతాయి.. రాబోయే 4-5 రోజులు వర్షాలు కొనసాగుతాయి’ అని సిమ్లా వాతావరణ విభాగం చీఫ్ సురేంద్ర పాల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com