రాయలసీమ వనరులను జగన్ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం రాయలసీమను అవినీతి కోసం, దోపిడీ కోసం వినియోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతల కోసమే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారన్నారు. ఇడుపులపాయలో పేదల అసైన్డ్ భూములు ఉన్నాయని, ఈ భూములపై అసెంబ్లీలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.300 కోట్ల దోపిడీ యథేచ్చగా జరిగిందన్నారు. తాడేపల్లి ఖజానాకు ఇసుక దోపిడీ సొమ్ము రూ.12 వేల కోట్లు చేరాయన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. ఇసుక దోపిడీ జరుగుతోందని, పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ.900 కోట్ల భారీ స్కామ్ జరిగిందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.