కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత బాహ్య ప్రపంచానికి, ఎన్నికల ప్రచారాలు, ర్యాలీల నుంచి కాస్త దూరంగా ఉంటున్న ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు.. తాజాగా హర్యానాకు చెందిన మహిళా రైతులతో మమేకం అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసానికి వచ్చిన రైతులను ఆహ్వానించారు. అనంతరం సోనియా, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా, కుమారుడు రాహుల్‌గాంధీ కలిసి వారితో భోజనం చేశారు. అనంతరం మహిళా రైతుల కోరిక మేరకు వారితో కలిసి.. సోనియా గాంధీ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
హర్యానాలోని సోనిపత్ జిల్లాకు చెందిన మహిళా రైతులు.. ఢిల్లీకి రాగా.. వారిని సోనియా గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. సోనియా నివాసంలో వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేశారు. మహిళా రైతులతో కలిసి.. సోనియా, ప్రియాంక గాంధీ సామూహిక భోజనాలు చేశారు. తర్వాత వారితో కలిసి ముచ్చటించారు. వారు చేసే పని, దానికి వచ్చే కూలీ, పండించే పంటలు.. తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోనియా గాంధీని నృత్యం చేయాలని మహిళా రైతులు కోరారు. అందుకు అంగీకరించిన సోనియా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. అయితే దీనికి సంబంధించిన మొత్తం వీడియోను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది స్వచ్ఛమైన సంతోషం అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. హర్యానాలోని సోనిపత్ జిల్లా మదీనా గ్రామంలో పర్యటించారు. అక్కడ పొలంలో మహిళా రైతులతో ముచ్చటించారు. ట్రాక్టర్‌తో పొలం దున్ని.. వారితో కలిసి నాట్లు వేశారు. అయితే ఆ సమయంలో తాము ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ నివాసాన్ని చూడాలని మహిళా రైతులు కోరారు. దీనికి బదులిచ్చిన రాహుల్‌గాంధీ తనకు ఇల్లు లేదని.. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పారు. అయితే తన తల్లి సోనియా గాంధీ ఇంటికి రావాలని వారిని ఆహ్వానించారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. అందులో ఢిల్లీకి వచ్చిన మహిళా రైతులు సోనియాగాంధీ నివాసానికి చేరుకున్నారు.