మార్గదర్శి చిట్‌లను రద్దు చేస్తూ చిట్ రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ ముగ్గురు ఖాతాదారులు హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఈ కేసు హైకోర్టులో విచారణకు రాగా.. ఖాతాదారుల తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. చిట్‌లకు డిపాజిట్‌లు సేకరించి చిట్ రిజిస్టార్ అనుమతి తీసుకున్న తరువాతనే చిట్ లు ప్రారంభమయ్యాయని ఖాతాదారుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. 50 శాతం డబ్బు చెల్లించి చిట్‌లు ప్రారంభించామని మార్గదర్శి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అర్దాంతరంగా ఎటువంటి సమాచారం లేకుండా చిట్‌లు ఎలా రద్దు చేస్తారని ఖాతాదారుల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. చిట్ రిజిస్టార్‌కు చిట్‌లు రద్దుచేసే అధికారం ఉందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం చిట్ రిజిస్టార్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.