ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఎపిసోడ్ దుమారం రేపింది. ‘నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’ అంటూ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. లోకేష్ పాదయాత్ర కూడా జిల్లాలోనే కొనసాగుతుండటంతో వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరా తీశారు. ఈ ఎపిసోడ్‌పై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందించారు.
విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఐ-ప్యాక్, వైఎస్సార్‌సీపీ లు ఇలా కుట్ర చేశారని జనార్దన్ ఆరోపించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి అనుచరుడు, వైఎస్సార్‌సీపీ డివిజన్ అధ్యక్షుడు సాంబయ్య, స్థానిక వాలంటీర్ కలిసి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైఎస్సార్‌సీపీ నేతలు ఫ్లెక్సీల వివాదాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు వస్తున్నందున టీడీపీ గెలుస్తుందనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లాలో ప్రశాంత రాజకీయాలు ఉంటాయని.. అలాంటి చోట విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఫ్లెక్సీ రాజకీయంపై దీనిపై పూర్తి ఆధారాలతో తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటానికైనా సిద్ధమన్నారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో విజువల్స్ ఆధారంగా.. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. జూనియర్ ఫ్లెక్సీల ఏర్పాటుకోసం ఐరన్‌ఫ్రేమ్‌లను త్రోవగుంటకు చెందిన వాలంటీర్ ఆఫ్రిది ఇచ్చినట్లుగా గుర్తించారు. రఘు అనే వ్యక్తి వాటిని తీసుకెళ్లినట్లు వాలంటీర్ చెప్పారు. దీంతో ఇది వైఎస్సార్‌సీపీ నేతల పనేనని టీడీపీ ఆరోపించింది. తాము ఈ ఫ్లెక్సీలు కట్టలేదని ఒంగోలు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు క్లారిటీ ఇచ్చారు.
ఒంగోలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై 'RAW NTR TRUST' కూడా స్పందించింది. వివాదాలకు దూరమని.. ఫ్యాన్స్ స్పందించవద్దన్నారు. RAW NTR TRUSTపై దుష్ప్రచారం చేస్తున్నాని.. ఈ ఫ్లెక్సీకి తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎన్టీఆర్ మాటల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. తారక్ అభిమానుల తరుపున ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వివాదాస్పద విషయాల్లో తమ హీరో పేరుని/ఫొటోని పెట్టొద్దన్నారు. ఎవరూ స్పందించొద్దని అభిమానులకు సూచించారు. మొత్తం మీద లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఒంగోలులో ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.