విశాఖలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికల్లో పది స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ల పదవులకు పదికి పది వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పది పోస్టులకు తన అభ్యర్ధులను నిలబెడితే.. టీడీపీ తొమ్మిది మందిని నిలబెట్టి పోటీ పడింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉంటే.. వైఎస్సార్‌సీపీకి 64 మంది ( వీరిలో వైఎస్సార్‌సీపీకి తొమ్మిది మంది ఇండిపెండెంట్లు మద్దతు) టీడీపీకి 26 మంది, జనసేనకు నలుగురు, సీపీఐ, సీపీఎం, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికల్లో జనసేన, సీపీఐ, సీపీఎం కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కంపా హనోక్, మందపాటి సునీత విదేశాలకు వెళ్లడంతో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో 89 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలవడానికి 50కిపైగా ఓట్లు రావాల్సి ఉండగా.. వైఎస్సార్‌సీపీ నుంచి పోటీలో ఉన్న.. నారాయణరావుకు 66, అక్కరమాని పద్మ, పీలా లక్ష్మీసౌజన్యకు 64 ఓట్లు చొప్పున, కోడిగుడ్డు పూర్ణిమ, కంటిపాము కామేశ్వరి, బల్ల లక్ష్మణరావు, భూపతిరాజు సుజాతకు 63 ఓట్లు చొప్పున, గుడ్ల విజయసాయి, బట్టు సూర్యకుమారికి 62 ఓట్లు చొప్పున, చల్లా రజిని 61 ఓట్లు రావడంతో వారు గెలుపొందినట్టు ప్రకటించారు.
ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో కొందరికి ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు లభించడం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవంగా వైఎస్సార్‌సీపీ 62 మంది కార్పొరేటర్ల బలం ఉండగా.. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఉరుకూటి నారాయణరావుకు 66, అక్కరమాని పద్మ, పీలా లక్ష్మీ సౌజన్యకు 64, కోడిగుడ్ల పూర్ణిమ, కంటిపాము కామేశ్వరి, బల్ల లక్ష్మణరావు, భూపతిరాజు సుజాతకు 63 ఓట్లు లభించాయి. అలాగే వైఎస్సార్2సీపీ అభ్యర్థి చల్లా రజనికి ఆ పార్టీ బలం కంటే ఒక ఓటు తక్కువ వచ్చింది. టీడీపీకి 26 మంది కార్పొరేటర్ల బలం ఉంటే ఆ పార్టీ తరపున పోటీ చేసిన పిసిని వరహా లక్ష్మీనరసింహం, బల్ల శ్రీనివాసరావు, బొమ్మిడి రమణకు 28 చొప్పున ఓట్లు వచ్చాయి. ఇరుపార్టీల నుంచి తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు ఓట్లు పడినట్లు చెబుతున్నారు.
బ్యాలెట్ పేపర్‌పై సీరియల్ నంబర్లు వేశారని.. అందుకే ఏ కార్పొరేటర్ ఎవరికి ఓటు వేశారనేది సులభంగా తెలిసిపోతుందని టీడీపీ వాదన. అందుకే నంబర్ లేకుండా బ్యాలెట్ పత్రాలు ఇవ్వాలంటూ టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పార్టీ కార్పొరేటర్లతో కమిషనర్ ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఆ తర్వాత కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లి ఎన్నికను రద్దు చేయాలని కోరారు. 2010 ఎన్నికల నియమావళిని అనుసరించి బ్యాలెట్ పత్రంపై సీరియల్ నంబర్ ముద్రించామని కమిషన్ అన్నారు. గతం నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇదే పద్ధతిలో జరుగుతున్నాయన్నారు.. అందుకే ఎన్నిక రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పారు.
ఈ ఎన్నికపై జిల్లా కలెక్టర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఫిర్యాదు చేస్తు న్నట్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తమ అభ్యర్థులకు క్రాస్ ఓ టింగ్ వేశారని ఇది తమ నైతిక విజయమని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మె ల్యేలు గత రెండు రోజులుగా కార్పొరేటర్లను బుజ్జగించడంతోపాటు ఎవరు ఎవరికి ఓటు వేశారనేది తమకు సీరియల్ నంబర్ను బట్టి తెలిసిపోతుందని భయపెట్టడంతో మరికొందరు తమకు ఓటు వేయాలనుకున్నా వేయలేకపోయారన్నారు.
బలం లేకపోయినా పోటీ పెట్టిన టీడీపీకి ఇది మరోసారి పరాభవం అని వైఎస్సార్‌సీపీ నేతలు ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలకడం విశేషమన్నారు మంత్రి, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల ఇన్‌చార్జ్ గుడివాడ అమర్‌నాథ్. సీఎం ఆదేశాలతో, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి సూచనలు, సలహాలతో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద రెండు పార్టీల్లో క్రాస్ ఓటింగ్ గందరగోళం కనిపిస్తోంది.