తెలుగుదేశం పార్టీ అంటేనే అన్ని కులాల సమాహారం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కనిగిరి మండలపరిధిలోని ఎర్ర ఓబనపల్లి గ్రామ క్యాంప్ వద్ద కమ్మ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..... అన్ని కులాలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. ‘గత 160 రోజులుగా పాదయాత్రలో అన్ని కులాల వారితో కలిసి నడిచాను. వారి సమస్యలు విని పరిష్కారాల మార్గాలకు హామీలు కూడా ఇచ్చాను. కానీ కమ్మ, మార్వాడి కులాల కుటుంబసభ్యులతో నేరుగా కలిసే అవకాశం తీసుకోలేదని’ తెలిపారు. అందుకే ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర కోరిక మేరకు ఇక్కడ కలిసే అవకాశం రావటం సంతోషాన్నిస్తుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలోని అన్ని కులాల వారు ప్రభుత్వ బాధితులేనన్నారు.