ఉపాధ్యాయ వృత్తి అంటేనే సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైనది. ఆ వృత్తికే వన్నె తెచ్చేవారు చాలా మంది ఉపాధ్యాయులు ఉంటారు. పిల్లలను చిన్నతనం నుంచే ప్రోత్సహించి.. వారిని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే తపన కలిగి ఉంటారు. నెలకు వచ్చే జీతం కోసమే కాదు, విద్యార్థులను ఒక లక్ష్యం వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేసే వారు ఉంటారు. పిల్లలపై తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది టీచర్లు అయితే.. తమ ఖర్చులతో పిల్లలకు పుస్తకాలు, ఉన్నత చదువులకు ఖర్చులు కూడా ఇచ్చేవారు ఉంటారు. అయితే ఈ ఉపాధ్యాయురాలు మాత్రం రోజూ రెండు నదులు కాలినడకన దాటుకుంటూ పిల్లలకు చదువు చెప్పేందుకు పాఠశాలకు వెళ్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రాంపూర్ జిల్లా ధూర్పూర్ గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తించే కర్మిలా టోప్పో కథ ఇది. ఆమె నిత్యం విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు రెండు నదులు దాటి వెళ్తారు. అయితే తన విధి నిర్వహణలో భాగంగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిత్యం.. పాఠశాలకు వెళ్లి పిల్లలకు చదువు చెప్తున్నారు. ఆమె తన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాలంటే మాత్రం రోజూ పెద్ద సాహసం చేయాల్సిందే. ఎందుకంటే తన మార్గంలో రోజూ రెండు నదులు దాటి వెళ్లాలి. తనకు స్కూలుకు వెళ్లడానికి మరో మార్గం లేకపోవడంతో కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. వర్షాలకు నదుల్లో నడుము లోతు నీరు ప్రవహిస్తున్నా.. వృత్తి ధర్మం కోసం అందులో తడుచుకుంటూనే ఆమె తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
"విద్యార్థులకు చదువు చెప్పడమే నా అంతిమ లక్ష్యం. అందుకోసం ఎలాంటి కష్టమైనా భరిస్తాను. పిల్లల భవిష్యత్‌ను నిర్మించడమే ముఖ్యం. ఇక పాఠశాలకు వెళ్లడానికి నేను రోజూ రెండు నదులు దాటాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గం లేనే లేదు. విద్యార్థుల భవిష్యత్ కోసం నేను క్రమం తప్పకుండా రోజూ పాఠశాలకు వస్తూనే ఉంటాను. వర్షాలు పడినా.. వరదలకు నదులు పొంగినా ఆ నీటిలోనే నడుచుకుంటూ వస్తాను. నా మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. ఈ ప్రయత్నాన్ని మాత్రం ఆపను" అని కర్మిలా టోప్పో వెల్లడించారు.
కర్మిలా టోప్పో చేస్తున్న కృషి పట్ల బల్‌రాంపూర్ జిల్లా కలెక్టర్ రెమిజియస్ ఎక్కా ప్రశంసలు కురిపించారు. మిగిలిన ఉపాధ్యాయులకు కూడా కర్మిలా టోప్పో గొప్ప ఆదర్శమని కొనియాడారు. వృత్తి పట్ల నిబద్ధతను కర్మిలా టోప్పోను చూసి చాలా మంది నేర్చుకుంటారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన సమయానికి మిగితా టీచర్లు కూడా చేరుకుని.. తమ విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని సూచించారు.