మణిపూర్‌లో ఇద్దరు మహిళలను బట్టలు ఊడదీసి.. నగ్నంగా ఊరేగించి అనంతరం వారిలోని ఒక మహిళపై అత్యంత అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థుల ముందు బట్టలు లేకుండా ఊరేగించబడి.. అందులో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినా ధైర్యం కోల్పోకుండా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని వెల్లడించారు. నిందితులపై కేసు పెట్టారు. అయితే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. చర్యలు మాత్రం చేపట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అత్యంత దుర్మార్గం తమపై జరిగినప్పటికీ ఆ ఇద్దరు మహిళలు ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. ఎలాగైనా వారికి జరిగిన అన్యాయంపై న్యాయబద్ధంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తమ ప్రయాణాన్ని పోలీస్ స్టేషన్ వైపు ప్రారంభించారు. మొదట ఘటన నుంచి తేరుకున్న మహిళలు.. ఘటనాస్థలి నుంచి వారి గ్రామం బి. ఫైనోమ్‌కు చేరుకున్నారు. 40 కుటుంబాలు నివసించే వారి గ్రామం మొత్తం ధ్వంసమై ఒక్కరు కూడా లేకుండా అందరూ పారిపోయారు. దీంతో కిలోమీటరు దూరంలో ఉన్న హౌఖోంగ్‌చింగ్ అనే మరో గ్రామానికి వెళ్లారు. అయినప్పటికీ తమపై ఆకృత్యానికి పాల్పడిన వారి బారి నుంచి రక్షించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ క్రమంలోనే తంగ్‌ఖుల్ గ్రామానికి వెళ్లి అక్కడి అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. ఆ తర్వాత మే 5 ఉదయాన్నే ఇద్దరు మహిళలు 2, 3 గంటల పాటు కొండపై ఉన్న మరో గ్రామానికి వెళ్లగా.. వారు అక్కడి నుంచి పారిపోగా మళ్లీ ఒంటరిగానే నివసించారు. ఆ తర్వాత మే 6 వ తేదీన నాగా తంగ్‌ఖుల్ గ్రామమైన లైరాంఖులెన్‌కు చేరుకున్నారు. అక్కడ వారం రోజుల పాటు జీవించారు. అక్కడి గ్రామస్థులు వారిని వారం రోజుల పాటు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ గ్రామ పెద్దకు జరిగిన విషయం మొత్తం వివరించగా.. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో మే 7 వ తేదీన ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మే 18 వ తేదీ వరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదు.
అయితే మే 18 వ తేదీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసేసరికి.. మణిపూర్ వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవడంతో ఈ కేసును పోలీసులు పక్కన పెట్టేశారు. బాధిత మహిళలు కూడా ప్రాణ భయంతో అదే గ్రామంలో తలదాచుకున్నారు. చివరికి ఇటీవల ఆ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ కేసులో చలనం వచ్చింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయిన వేళ.. మణిపూర్ పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయగా.. అందులో ఒక మైనర్ ఉండటం గమనార్హం.