ఏపీకి తెలంగాణ లేఖ రాసింది.. పోలవరం ప్రాజెక్టులోని గేట్లన్నీ తెరిచే ఉంచాలని కోరింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ కోరింది. ఈమేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ) కి లేఖ రాశారు. గతేడాది పోలవరం బ్యాక్ వాటర్ వల్ల.. భద్రాచలం ముంపునకు గురైన విషయాన్ని ఈ లేఖలో పస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా.. వాటర్ ఇయర్‌లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని కోరారు. 2022 జూలై వరదకు పోలవరం దగ్గర వరద ప్రవాహం సరిగ్గా లేక బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలం పరిసరాల్లోని 28 వేల ఎక రాల సాగు భూమి ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా పోలవరంలో నీటిని నిలిపివేయరాదని, వాటర్ ఇయర్‌లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు గేట్లను మూయకపోతే ఆ ప్రభావంతో వరద వెనక్కి తన్నే ప్రమాదం ఉందనే ఆందోళణ వ్యక్తమవుతోంది. ఈ ప్రభావంతో భద్రాచలంతో పాటు తెలంగాణలోని పలు గ్రామాలు నీట మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. గతేడాది గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద వచ్చింది. ఈ ప్రభావంతో ముంపు మండలాలు, చివరకు భద్రాచలం ముంపునకు గురైంది. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టే వరకూ ప్రాజెక్టు స్లూయిస్ గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచవద్దని కోరారు. అందుకే ఈ ఏడాది ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచాలని తెలంగాణ డిమాండ్ కోరింది.
ఇదిలా ఉంటే.. భద్రాచలం దగ్గర సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద 36.3 అడుగులు.. ఇటు పొలవరం దగ్గర నీటిమట్టం 11.8 మీటర్లు ఉంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ విపత్తుల నిర్వహన సంస్థ తెలిపింది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు.. అందుకు తగినట్లుగా పరిస్థితిని బట్టి సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు ఇస్తున్నారు.
అంతేకాదు అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లను కూడా రంగంలోకి దించారు. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూనవరం పి.గన్నవరంలో సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరో 4 ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లు మామిడికుదురు, అయినవిల్లి, కుక్కునూరు, వేలేరుపాడులో ఉంచారు. గోదావరి వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.