ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. టీటీడీ ఛైర్మన్ పదవి అంశాన్ని ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు.. సీఎంకు ఓ రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరి కులస్తులు దాదాపు 22శాతం జనాభా ఉన్నారని.. మాజీ ముఖ్యమంత్రి నీలం నంజీవరెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ కులన్తులను వాడుకోవడమే కానీ కనీసం రిజర్వేషన్స్ సౌకర్యం కూడా కలగజేయడానికి ఏ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్దితో ప్రయత్నం చేయలేదన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం అవకాశం ఉండి కూడా ఈ జుతిని రిజర్వేషన్స్ విషయంలో నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా కాపు సంక్షేమం విషయంలో కాపులు చెప్పుకుంటేనే కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా ఖర్చుపెట్టవలసిన నిధులను ఖర్చుపెట్టకపోవడమే కాక, జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు రెడ్డి కులస్తులతో పోల్చుకున్నప్పుడు ఇవ్వకపోవడం, జనాభా ప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్స్ సౌకర్యం లేకపోవడం గమనిస్తూనే ఉన్నామన్నారు. ఈ చర్యలు చూసుకుంటే కాపు కులస్తుల పట్ల ఎంత ఉందో తెలుస్తూనే ఉందన్నారు.
ఈ నెలలో టీటీడీ ఛైర్మన్ పదవికి కొత్తవారిని ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో కాపు కులస్థుల అవసరం ఉందని రుజువు చేసుకోదలిచినా.. కాపుల పట్ల సానుభూతి ఉన్నా కాపు కులస్థులకు ప్రత్యేకించి రాయలసీమలో 20లక్షల జనాభా కలిగి ఉన్న బలిజ కులస్తుల్లో ఒకరికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా కాపు కులస్తుల తరఫున కోరుచున్నాను అన్నారు. 'భవిష్యత్‌లో కాపు సామాజికవర్గ సహకారం అందుకోదలిస్తే తెలివైన మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ.. లేనిచో మీకు కాపుల పట్ల ఏ మాత్రం ప్రేమ కాని, సానుభూతి లేనట్లేనని భావించవలసి వస్తుంది' అన్నారు.