ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సూర్యనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
2019 నుంచి 2021 మధ్యలో కేఆర్ సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వ అభియోగాలు ఉన్నాయి. ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.