సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 9 ఏళ్ల క్రితం నాటి కేసును కొట్టేసింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరులో చిరంజీవిపై కేసు నమోదైంది. నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి.. 2009లో ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు పొలిటికల్‌గా చిరంజీవి యాక్టివ్ గానే ఉన్నారు. ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత కేంద్రమంత్రి కూడా అయిన చిరంజీవిని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆశల్లేని పరిర్థితుల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసి పంపింది. అదే సమయంలో గుంటూరులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై చిరంజీవిపై కేసు నమోదైంది. ఈ కేసుపై దాదాపు పదేళ్ల పాటు విచారణ తర్వాత హైకోర్టు దీన్ని కొట్టివేయడంతో చిరంజీవికి ఊరట లభించింది.