రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఒంగోలు కలెక్టర్ దినేష్‌కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... అక్టోబర్ 2 నుంచి 4, 5 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పోటీలు గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు దశల్లో జరుగుతాయని తెలిపారు. పోటీల్లో 17 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా పాల్గొనవచ్చన్నారు. పోటీలను నిర్వహించేందుకు అవసరమైన మైదానాలను, క్రికెట్ పోటీలకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు.