పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ-టీడీపీ వర్గాల మధ్య పరస్పర సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రెండు వర్గాలు పోటాపోటీగా ఒక్కచోటకి చేరడంతో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. గురువారం బస్టాండ్ దగ్గర ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గత కొంతకాలంగా టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల ఆక్రమణ,మట్టి తవ్వకాలకు సంబంధించి రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. మట్టి అక్రమ రవాణాను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించగా.. టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను నిరసిస్తూ గురువారం టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.
తమ ర్యాలీని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈలోపు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అటువైపు వెళ్లారు.. దీంతో ఆయన కారుపైకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు వినుకొండ టౌన్ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు కొద్దిసేపు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
అయితే స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే దాడికి దిగినట్లు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలు తన కారుపై రాళ్ల దాడి చేశారని.. కావాలనే వారు ప్లాన్ ప్రకారం దాడి చేశారన్నారు. టీడీపీ కుట్రలను తిప్పి కొడతామని.. ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను అన్నారు. రెండు రోజుల క్రితం తన డెయిరీ ఫామ్‌ను ధ్వంసం చేశారని.. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారని మండిపడ్డారు. ప్రజల తిరుగబాటుతో తోక ముడిచారని.. జీవీ ఆంజనేయులుకు ప్రజాభిమానం లేదన్నారు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కొద్దిరోజులుగా మట్టి తవ్వకాల విషయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై టీడీపీ ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే అక్రమంగా మట్టిన తన సొంత డెయిరీ కోసం ఉపయోగించుకుంటున్నారని.. ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఫిర్యాదుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.