దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలో మొదలైన వర్ష బీభత్సం ఇప్పుడు దక్షిణాదిని తాకింది. వర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతోపాటు వాలంటీర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే వరద బాధితులను కాపాడేందుకని వాలంటీర్‌గా వెళ్లాడు. కానీ ఊహించని రీతిలో 35 ఏళ్ల తర్వాత తొలిసారి తన కన్నతల్లిని కలుసుకున్నాడు. సినిమా స్టోరీ తలదన్నే ట్విస్టులున్న ఈ రియల్ స్టోరీ మీకోసం..
మనం చెప్పుకున్న వాలంటీర్ పేరు జగ్జిత్ సింగ్. అతడి వయసు 37 ఏళ్లు. చిన్నతనం నుంచి నానమ్మ తాతయ్యే అతణ్ని పెంచి పెద్ద చేశారు. కాస్త వయసొచ్చాక... తాతయ్య.. అమ్మానాన్న ఎక్కడ? అని జగ్జిత్ అడిగేవాడు. నీ చిన్నప్పుడే మీ అమ్మానాన్న ఓ యాక్సిడెంట్‌లో చనిపోయార్రా అని ఆ తాత చెబుతుండేవాడు. దీంతో జగ్జిత్ కూడా తాత చెప్పిందే నిజమని నమ్మేవాడు.
కానీ వాస్తవం ఏంటంటే.. జగ్జిత్‌కు ఆరు నెలల వయసున్నప్పుడే అతడి తండ్రి చనిపోయాడు. దీంతో అతడి తల్లి మరో పెళ్లి చేసుకోగా.. రెండేళ్ల వయసులో జగ్జిత్‌ను నానమ్మ తాతయ్య వాళ్లు తమ దగ్గరికి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి అతడి ఆలనా పాలనా వాళ్లే చూసుకున్నారు. జగ్జిత్ పెరిగి పెద్దయ్యి ఖదియాన్‌లో గురుద్వారాలో ఆధ్యాత్మిక గాయకుడిగా మారాడు. అతడు ఓ ఎన్జీవోను కూడా నడుపుతున్నాడు.
ఆ ఎన్జీవో సభ్యులతో కలిసి.. ఇటీవలే భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన పాటియాలా ప్రాంతానికి జగ్జిత్ వెళ్లాడు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతుండగానే.. జగ్జిత్‌కు అతడి అత్త ఒకరు ఫోన్ చేశారు. మీ అమ్మమ్మ వాళ్లది కూడా ఆ ప్రాంతమే అని చెప్పింది. అడ్రస్ సరిగ్గా తెలీదు గానీ బొహార్‌పూర్ అనే ఊళ్లో వాళ్లు ఉంటుండొచ్చు అని చెప్పింది.
37 ఏళ్ల వయసొస్తే మాత్రం.. అమ్మమ్మ వాళ్ల ఇల్లు అనగానే ఆ ఫీలింగే వేరు కదా. పుట్టినప్పటి నుంచి అమ్మమ్మను చూసిన గుర్తు లేని జగ్జిత్ ఎలాగోలా కష్టపడి తన అమ్మమ్మ ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. వాళ్ల ఇంటికి వెళ్లి తన అమ్మమ్మ ఆమె ఔనో కాదో తెలుసుకోవడం కోసం వరుసబెట్టి ప్రశ్నలు వేశాడు. మొదట్లో అనుమానంగా చూసిన ఆమె.. చివరకు ‘నా కుమార్తె హర్జిత్‌కు మొదటి పెళ్లి ద్వారా ఓ కొడుకు పుట్టాడు’ అని చెప్పింది. ఆ మాట వినగానే అతడు ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఆ దురదృష్టవంతుణ్ని నేనే అని చెప్పాడు.
కాసేపటికే జగ్జిత్ తన కన్నతల్లి హర్జిత్ కౌర్‌ను చూశాడు. కాళ్ల నొప్పి కారణంగా సరిగా నడవలేకపోతున్నప్పటికీ.. 35 ఏళ్ల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో ఆమె సంతోషం పట్టలేకపోయారు. తల్లిని హత్తుకున్న జగ్జిత్ మనసారా ఏడ్చేశాడు. వాస్తవానికి జగ్జిత్‌కు తన తల్లి బతికే ఉందని ఐదేళ్ల క్రితం తెలిసింది. కానీ అప్పటికే తాతయ్య నానమ్మతోపాటు పెద్దమ్మ పెదనాన్న కూడా చనిపోవడంతో.. తన తల్లి ఎవరు..? ఆమె ఎక్కడ ఉంటుందనే విషయాలు తెలుసుకోలేకపోయాడు.
జగ్జిత్ తన చిన్నతనంలో దిగిన ఫొటోలను చూసినప్పుడు.. ఒక మహిళతో కలిసి ఉన్న ఫొటోను గమనించాడు. కానీ ఆమే తన తల్లి అని తెలుసుకోలేకపోయాడు. తన మనవడి వల్ల కోడలి కొత్త కాపురంలో ఇబ్బంది రావొద్దనే భావనో లేదంటే.. మరో ఇంటి కోడలిగా వెళ్లిన అమ్మాయితో మాకెలాంటి సంబంధాలు ఉండొద్దనే పంతమో.. కారణం ఏంటో తెలీదు గానీ.. ఆ తల్లీ కొడుకులు ఒకరి ప్రేమకు మరొకరు దూరమయ్యారు.
జగ్జిత్ అంటే చిన్నపిల్లాడు.. అతడికి ఏమీ తెలీదు.. మరి ఆ తల్లి ఇన్నాళ్లూ తన కొడుకు చూడకుండా ఎలా ఉందనే అనుమానం మీకొచ్చిందా..? జగ్జిత్ వాళ్ల తాతయ్య పోలీసు అధికారి. 20 ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం హర్యానా నుంచి పంజాబ్‌లోని ఖడియాన్‌కు షిఫ్ట్ అయ్యింది. ఒకవేళ తన కొడుకు ఫలానా దగ్గర ఉన్నాడని తెలిసినా సరే.. ఆమె మాత్రం ఎలా వెళ్లగలదు. ఆమెకంటూ ఓ భర్త, పిల్లలు, సంసారం ఉన్నాయి కదా. పైగా మొదటి భర్త అత్తింటివారు ఏమంటారోననే భయం ఉండనే ఉంది కదా..!
అన్నట్టూ మరో విషయం ఏంటంటే జగ్జిత్‌కు పెళ్లయ్యింది. 14 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. తన భార్యా పిల్లలతో కలిసి వెళ్లిన అతడు తొలిసారి తన కన్నతల్లిని కలుసుకున్నాడు. ఇదంతా చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది..? మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి.