మెయితీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో దాదాపు 3 నెలలుగా మణిపూర్‌లో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరువర్గాలకు చెందిన ప్రజలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరు కుకీ మహిళలను బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి అందులోని ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ మరుసటి రోజే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు సభా కార్యకలాపాలేవీ సాగకుండా ఇరు సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఘటనతో అటు మణిపూర్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఈ అమానుష ఘటనకు సంబంధించి ఇప్పటికే మణిపూర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వీడియో ఆధారంగా నిందితుల్లో ఒక మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసింది. మరోవైపు.. ఆ ఘటనకు సంబంధించి వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి.. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళల నగ్న ఊరేగింపు, ఆపై గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన కేసుతో పాటు 3 నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న ఘటనలపై కూడా సీబీఐ అధికారుల బృందం దర్యాప్తు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో పాటు ఈ కేసు అత్యంత సున్నితమైంది కావున.. దీని విచారణను కూడా మణిపూర్‌లో కాకుండా రాష్ట్రానికి వెలుపల దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మణిపూర్‌కు పొరుగున ఉన్న అస్సాంలోని కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి.
అటు.. మణిపూర్‌లో జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలకు కారణమైన మెయితీ, కుకీ తెగలకు చెందిన వారితోనూ కేంద్ర హోంశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మణిపూర్‌లో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఈ చర్చల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెయితీ, కుకీ వర్గాల మధ్య మణిపూర్‌లో మే 3 వ తేదీన ప్రారంభమైన ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది మృతి చెందారు. వేలాది మంది ఇళ్లు, ఊర్లు వదిలేసి నిరాశ్రయులుగా ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మెయితీ, కుకీ తెగలకు చెందినవారితోపాటు పోలీసులు, సైన్యం, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మే 3 వ తేదీ నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. మణిపూర్‌లోని పోలీసులకు చెందిన పోలీస్ స్టేషన్లు, ఆయుధాగారాలపై ఆందోళన కారులు దాడులు చేసి వేల సంఖ్యలో ఆయుధాలను దోచుకెళ్లినట్లు సమాచారం.