ఐఐటీలు అంటేనే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలు. అయితే ఈ ఐఐటీల్లో సీటు సాధించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. అందుకే మన దగ్గర స్కూల్ దశ నుంచే ఐఐటీ కోచింగ్‌లు ఇస్తున్నారు. అప్పటికీ కొంతమందికి ప్రవేశాలు రాకపోతే మళ్లీ మళ్లీ కోచింగ్‌లు తీసుకునే వారు కూడా ఉన్నారు. ఐఐటీల్లో చేరి కోర్సు పూర్తి చేసిన వారికి ఐదంకెల జీతంతో బయటికి వస్తారు. అందుకే ఐఐటీ చదువులకు యమ క్రేజ్ ఉంటుంది. అయితే గత కొన్నేళ్లకు సంబంధించిన లెక్కలు చూస్తుంటే మాత్రం ఐఐటీలు అంటేనే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే గత ఐదేళ్లలో 8 వేల మంది ఐఐటీల నుంచి కోర్సు పూర్తి కాకుండానే మధ్యలో డ్రాపౌట్లుగా వెనుదిరుగుతున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఐదేళ్లలో 39 మంది సూసైడ్ చేసుకోవడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ లెక్కలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్.. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య దేశంలోని ఉన్నత విద్యా సంస్థల నుంచి 32 వేల మందికి పైగా విద్యార్థులు డ్రాపౌట్‌గా వెనుదిరిగినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. అందులో కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి 17 వేల 454 మంది, ఐఐటీల నుంచి 8 వేల 139 మంది, ఎన్ఐటీల నుంచి 5 వేల 623 మంది, ఐఐఎస్ఈఆర్ నుంచి 1046 మంది ఐఐఎంల నుంచి 858 మంది కోర్సులు పూర్తి చేయకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు తెలిపారు. దీంతో 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 32 వేలు ఉందని పేర్కొన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు 52 శాతం ఉన్నారని తెలిపారు.
మరోవైపు.. ఐఐటీల్లో ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గత ఐదేళ్లలో ఐఐటీల్లోని 39 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని.. సుభాష్ సర్కార్ తెలిపారు. మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో 98 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు చెప్పారు. వారిలో 39 మంది ఐఐటీ విద్యార్థులు, 25 మంది ఎన్ఐటీ విద్యార్థులు, 25 మంది కేంద్ర విశ్వవిద్యాలయాల స్టూడెంట్స్, నలుగురు ఐఐఎం విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో - ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. ఒంటరిగా ఫీలవడం, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు వంటి కారణాలతో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నట్లు కేంద్ర మంత్రి రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.