ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పరిస్థితుల్ని చూస్తుంటే బాధేస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 06:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో లోకేష్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులే అని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎకనామిక్‌ యాక్టివిటీని పూర్తిగా నిలిపివేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేశారని మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని నారా లోకేష్ చెప్పారు. అప్పు చేసి సంక్షేమం చేయడం గొప్ప కాదని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసే సామర్థ్యం రాష్ట్రానికి రావాలన్నారు. నిపుణులందరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు.


తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందర్నీ ఒప్పించి అమరావతిని రాజధానిగా ప్రకటించారని, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారని లోకేష్ పేర్కొన్నారు. కానీ, సీఎం జగన్ మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని ముక్కులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమని ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ హబ్‌గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంను ఐటీ హబ్‌గా మారుస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించిందన్నారు.


జగన్ పాలనలో ఐటీ మంత్రిని చూస్తుంటే కోడిగుడ్డు గుర్తుకు వచ్చే పరిస్థితి నెలకొందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని ప్రశ్నిచారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి కియా, ఫాక్స్‌కాన్ సంస్థలు వచ్చాయన్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తరిమేసిన కంపెనీలను తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్న కంపెనీలకు ముందు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముందు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉంటేనే మరిన్ని సంస్థలు ఏపీకి వస్తాయని చెప్పారు.


అలాగే, ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ బ్రాండ్ విలువ పెంచే విధంగా కొత్త పాలసీలు తీసుకొస్తామని చెప్పారు. ఎన్నో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం విధానంతో ముందుకు వెళ్తున్నాయని.. అది ముందుగానే ఆలోచించి ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఫైబర్ గ్రిడ్‌పై ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని పేర్కొన్నారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అవహేళన చేసిన వాళ్లు.. ఇప్పుడు ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని లోకేష్ తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com