ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందం చూసి పదవి ఇచ్చారని ,,,మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2023, 09:12 PM

మహారాష్ట్రలోని పార్టీల్లో చీలికలు వచ్చి రెండుగా విడిపోయి నిత్యం కొట్టుకుంటున్నాయి. అటు.. శివసేన, ఇటు ఎన్సీపీల్లోని రెండు వర్గాలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని ఓ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీంతో మరోసారి ఇరు వర్గాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. దీంతో ఆ మహిళా ఎంపీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై .. ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రియాంక చతుర్వేది అందాన్ని చూసి.. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే.. ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారని సంజయ్ శిర్సత్ అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీశాయి. దీనిపై ప్రియాంకా చతుర్వేదితోపాటు ఆదిత్య ఠాక్రే కూడా స్పందిస్తూ.. సంజయ్ శిర్సత్‌పై ఎదురుదాడికి దిగారు.


తన అందాన్ని చూసే శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నుంచి రాజ్యసభలో ఆదిత్య ఠాక్రే స్ధానం ఇచ్చారని సంజయ్‌ శిర్సత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్ వేదికగా స్పందించారు. తాను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో సంజయ్ శిర్సత్ లాంటి వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదని.. గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సదరు ఎమ్మెల్యేకు తగదని.. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయని బదులిచ్చారు. మహిళల అభిప్రాయాలను గౌరవించండని ప్రియాంక చతుర్వేది ట్వీట్‌ చేశారు.


మరోవైపు.. ప్రియాంక చతుర్వేదిపై సంజయ్ శిర్సత్ చేసిన వ్యాఖ్యలపై ఆదిత్య ఠాక్రే కూడా తీవ్రంగా స్పందించారు. సంజయ్ శిర్సత్ చాలా వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వారు ఎలా రాజకీయాల్లో ఉన్నారో తనకు అర్థం కావడం లేదని ఆదిత్య ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వివాదం చెలరేగిన నేపథ్యంలో సంజయ్ శిర్సత్.. తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో ఈ వ్యాఖ్యలు చేశారని.. వాటినే ప్రస్తుతం తాను చెప్పినట్లు వివరణ ఇచ్చారు. 2019 వరకు కాంగ్రెస్‌లో ఉన్న ప్రియాంక చతుర్వేది.. ఆ తర్వాత హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనలో చేరారు.


2019 లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత మరాఠా రాజకీయాల్లో ఎప్పుడు ఏ తుఫాను సంభవిస్తుందో.. రాజకీయ పండితులు కూడా విశ్లేషించలేక పోతున్నారు. ఎందుకంటే తొలుత ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్.. బీజేపీకి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వం త్వరగానే కూలిపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మహావికాస్ ఆఘాఢీగా ఏర్పడి అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత శివసేనలో చీలిక తెచ్చిన ఏక్‌నాథ్ షిండే.. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరోసారి ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్.. శివసేన షిండే వర్గం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎవరికీ అంతుచిక్కకుండా పోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com