సాధారణంగా విదేశాల నుంచి బంగారం, డ్రగ్స్, ఖరీదైన వస్తువులు ట్యాక్స్ కట్టకుండా తీసుకు వస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారు. మన దేశంలోని అన్ని నగరాల్లో నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అయితే ఒక వ్యక్తి మాత్రం విదేశాల నుంచి వస్తూ ఏకంగా అడవి జంతువులను తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. కొండ చిలువలు, బల్లులను తీసుకుని రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులోని తిరుచ్చి ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు.. మలేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిద్దీన్ అనే వ్యక్తి ఆదివారం వచ్చాడు. అతడు వస్తూ వస్తూ తనతోపాటు కొండ చిలువలు, బల్లులను కూడా అక్రమంగా మలేషియా నుంచి భారత్‌కు తీసుకువచ్చాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా మహమ్మద్ మొయిద్దీన్ బ్యాగు చూసిన కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో 47 కొండ చిలువలు, 2 బల్లులు ఉండటం తీవ్ర సంచలనంగా మారింది.
అయితే ఆ కొండ చిలువలు, బల్లులు ప్రాణాలతో ఉండటం గమనార్హం. బ్యాగులో ఉంచినపుడు ఆ జంతువులు చనిపోకుండా ఉండేందుకు రంధ్రాలు ఉన్న బాక్సుల్లో వాటిని తీసుకువచ్చాడు. అయితే ఆ 47 కొండ చిలువలు, బల్లులు పలు రకాల జాతులకు చెందినవిగా గుర్తించారు. దీంతో కొండ చిలువలు, బల్లులను స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు.. మహమ్మద్ మొయిద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు.. తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ కొండ చిలువలు, బల్లులను తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.