వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారని తెలుగు దేవం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానని.. ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
సీఎం జగన్ బటన్ నొక్కుతున్నా అని పదేపదే చెబుతున్నారని.. బటన్ నొక్కడం కాదు, బటన్ బుక్కుడు ఎక్కువైందని చంద్రబాబు దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 8 సార్లు పెంచారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నూతన విద్యుత్ పాలసీ తీసుకొస్తామని.. విద్యుత్ ఛార్జీలు తగ్గించే బాధ్యత తనదని చెప్పారు. ఇక, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని వెల్లడించారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ హిట్ అయిందని.. దీని ద్వారా యువతలో చైతన్యం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే అని అన్నారు. ఇక, నాసిరకం మద్యం సరఫరాతో సీఎం జగన్ పేద ప్రజల రక్తం తాగుతున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పాత మద్యం విధానం తీసుకొచ్చి ధరలు తగ్గిస్తామని.. నాసిరకం మద్యం నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముందుచూపుతోనే టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని చంద్రబాబు తెలిపారు. హంద్రీనీవా, తెలుగు గంగ, ముచ్చుమర్రి, ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించానని.. రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా అని ప్రశ్నించారు. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. రాయలసీమలో తాము రూ. 12,400 కోట్లు ఖర్చు పెట్టామని.. కానీ, సీమ ద్రోహి జగన్ ఖర్చు చేసింది రూ. 2 వేల కోట్లే అని వివరించారు.
అందుకే సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రకటించడానికి తాను ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ.. 3 రాజధానులు కడతారట అని ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులని అంటున్నారని చెప్పారు. చివరికి, మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా సీఎం జగన్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పరదాల మాటున కాదు.. ధైర్యం ఉంటే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదని చంద్రబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa