దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌కు విశాఖ వేదికవుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైలాసపురం దగ్గర ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు. ఇనార్బిట్ మాల్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఇందులో రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని.. విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అని అభివర్ణించారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని.. మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉందన్నారు సీఎం. రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామని.. ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటామన్నారు.
మొత్తం 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు మాల్‌ను నిర్మిస్తోంది.. మాల్ తొలి దశ పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తున్నారు. పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి మాల్‌ను అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు టార్గెట్‌గా పెట్టుకుంది. మాల్ రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా.. ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నారు.
విశాఖ పర్యటన సందర్భంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆంధ్ర యూనివర్శిటీలో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి బయల్దేరారు.