మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. గిర్డర్ యంత్రం కుప్పకూలిన ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లాలోని షాపూర్లో మంగళవారం వేకువ జామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్-3 రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా గిర్డర్లు మోసే యంత్రం కార్మికులపై పడింది. ఘటనాస్థలంలోనే 17మంది కార్మికులు మృతి చెందారు.. పలువురికి గాయాలు అయ్యాయి. మృతులను, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
100 అడుగుల ఎత్తు నుంచి ఈ గిర్డర్ పడినట్లు చెబుతున్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సమృద్ధి మహామార్గ్ ను నాగ్‌పూర్-ముంబై మధ్య 701 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేలో రెండు దశలు పూర్తికాగా.. మూడో దశ పనులు జరుగుతున్నాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది.