దివాలా అంచున ఉన్న పాకిస్థాన్.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిలవుట్ ప్యాకేజీ కోసం అర్రులు చాస్తోన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు 3 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడం కోసం ఐఎంఎఫ్ అనేక నిబంధనలు విధిస్తోంది. అందులో భాగంగా.. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను పెంచాలని సూచించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధరను రూ.19.95, డీజిల్ ధరను రూ.19.90 (పాకిస్థాన్ కరెన్సీ) చొప్పున పెంచుతూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు.
గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనలు గణనీయంగా పెరిగాయని పాక్ ఆర్థిక మంత్రి తెలిపారు. కానీ అంత మేర పెంచకుండా.. సాధ్యమైనంత తక్కువగానే ధరలు పెంచామని తెలిపారు. ఆర్థిక కమ్రశిక్షణ పాటించే విషయంలో ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి పక్కకు తప్పుకునే పరిస్థితుల్లో తమ దేశం లేదని దార్ తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇంధన ధరలను పెంచక తప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మరి కొద్ది నెలల్లో పాకిస్థాన్‌లోని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలను పెంచడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇంధనం ధరలను రూ.60 మేర పెంచాలని పాక్ ప్రభుత్వానికి ఐఎంఎఫ్ సూచించింది. కానీ అంత మేర పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో.. రూ.20 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రజలు పెరిగిన నిత్యావసరాల ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 29 శాతానికిపైగా ఉంది. ఇప్పుడు ఇంధన ధరలు కూడా పెరగడంతో.. వారి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయని.. నిత్యావసరాల ధరల పెంపునకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ధరలు పెంచక ముందు పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.253 ఉండగా.. డీజిల్ ధర రూ.253.50 పైసలు ఉంది. తాజా పెంపుతో పాక్‌లో ఇంధన ధరలు రూ.273కి చేరనున్నాయి. (ఈ ధరలు పాకిస్థాన్ కరెన్సీలో. ఒక పాకిస్థాన్ రూపాయి విలువ మన కరెన్సీతో పోలిస్తే 0.29 పైసలు ఉంటుంది) మన దేశంలో ఇంధన ధరలు 441 రోజులుగా నిలకడగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, తగ్గుదలకు సంబంధం లేకుండా... చమురు సంస్థలు దాదాపు 63 వారాలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. చివరిసారిగా 2022 మార్చి 20న ఇండియాలో పెట్రోల్ ధరలను సవరించారు.