ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దివాకర్ ట్రావెల్స్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో.. దివాకర్ ట్రావెల్స్ బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి తప్పుడు రిజిస్ట్రేషన్లతో నడుపుతున్నారంటూ అభియోగాలు చేయటంతో.. ప్రభాకర్ రెడ్డికి, తెలంగాణ రవాణా శాఖకు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ కూడా అయ్యింది. ఈ విషయంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు కావటంతో.. అధికారులు పలు వాహనాలను సీజ్ చేశారు కూడా. తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2020, అక్టోబర్ 12న రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారన్నారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను జఫ్తు చేసి ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... వచ్చే నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం.. సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది.