సోమవారం తెల్లవారుజామున.. జైపూర్ - ముంబై సూపర్‌ఫాస్ట్ రైలులో జరిగిన కాల్పుల ఘటన.. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. రైలులో విధుల్లో ఉన్న ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ - ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్.. తన ఉన్నతాధికారి అయిన ఏఎస్సై టికారామ్ మీనాతోపాటు మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. అనంతరం రైలు దిగి పారిపోతుండగా.. రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఘనశ్యామ్ ఆచార్య అనే తోటి కానిస్టేబుల్ పోలీసులకు వివరాలు వెల్లడించారు.
జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ రైలులో ఆదివారం రాత్రి 2 గంటల 53 నిమిషాలకు మొత్తం ముగ్గురు ఆర్పీఎఫ్ సిబ్బంది సూరత్ రైల్వే స్టేషన్‌లో విధులకు ఎక్కారు. ఇందులో ఆచార్య ఘనశ్యామ్‌తోపాటు ఏఎస్సై టికారామ్ మీనా (58), కానిస్టేబుళ్లు నరేంద్ర పార్మర్ (58), చేతన్ సింగ్ (33) ఉన్నారు. ఇందులో టికారామ్ మీనా, చేతన్ సింగ్ ఇద్దరూ ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగా నరేంద్ర పార్మర్ స్లీపర్ కోచ్‌లోకి వెళ్లాడు. అయితే అరగంట తర్వాత ఏఎస్సై టికారామ్ మీనా వద్దకు వెళ్లి తాను రిపోర్ట్‌ను అందించినట్లు ఘనశ్యామ్ ఆచార్య వెల్లడించాడు. అప్పుడు చేతన్ సింగ్‌కు ఆరోగ్యం బాగోలేదని.. జ్వరం వచ్చేలా ఉందని.. ఏఎస్సై తనతో చెప్పినట్లు ఘనశ్యామ్ చెప్పాడని తెలిపాడు. అయితే మరో 2 గంటలు డ్యూటీ ఉన్నప్పటికీ చేతన్ సింగ్ తర్వాత స్టేషన్‌లో దిగాలనుకున్నాడని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ముంబై సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు ఏఎస్సై తెలియజేయగా.. వారు అందుకు నిరాకరించారు. డ్యూటీ పూర్తి చేసి వస్తే ముంబైలో చికిత్స అందిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని చేతన్ సింగ్‌కు ఏఎస్సై చెప్పినా అతడు వినలేదని వెల్లడించారు.
ఈ సమయంలో చేతన్ సింగ్ వద్ద తుపాకీ తీసుకుని.. అతడ్ని విశ్రాంతి తీసుకునేలా చూడాలని తనకు ఏఎస్సై చెప్పినట్లు ఘనశ్యామ్ వెల్లడించాడు. అయితే చేతన్ వద్ద తుపాకీ తీసుకున్నానని.. పడుకోవాలని సూచించినా అతడు వినలేదని చెప్పాడు. అనంతరం 10 తర్వాత తన తుపాకీ కావాలని అడిగాడని.. ఇవ్వకపోవడంతో గుంజుకుని వెళ్లాడని తెలిపాడు. అయితే పొరపాటున చేతన్ తుపాకీకి బదులు తన తుపాకీ తీసుకెళ్లాడని.. ఆ తర్వాత వెళ్లి మళ్లీ ఎవరి రైఫిల్ వాళ్లు తీసుకున్నట్లు వివరించాడు. ఆ సమయంలో చేతన్ చాలా ఆగ్రహంగా ఉన్నాడని.. ఏఎస్సైతో వాగ్వాదం జరిగినట్లు వివరించాడు. అప్పుడే చేతన్ సింగ్ కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడని చెప్పాడు.
ఆ తర్వాత తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించాడు. ఉదయం 5 గంటల 25 నిమిషాలకు రైలు వైతర్నా స్టేషన్‌కు చేరుకోగానే.. తన తోటి కానిస్టేబుల్ ఒకరు ఫోన్ చేసి.. ఏఎస్సైని చేతన్ కాల్చి చంపాడని చెప్పినట్లు తెలిపాడు. వెంటనే అక్కడికి తాను వెళ్తుండగా.. ప్రయాణికులందరూ భయంతో పరుగులు తీశారని పేర్కొన్నాడు. వెంటనే మిగితా కానిస్టేబుల్‌లకు ఫోన్ చేశానని.. కంట్రోల్ రూమ్‌కు కూడా సమచారం అందించినట్లు చెప్పాడు. 10 నిమిషాల తర్వాత ఎవరో చైన్ లాగి రైలును ఆపేశారని.. అప్పటికే రైలు మిరా రోడ్ - దహిసార్ స్టేషన్ల మధ్య ఉందని చెప్పాడు. కోచ్ డోరు వెనక నుంచి చూస్తే.. చేతన్ సింగ్ తుపాకీ పట్టుకుని కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడని.. దీంతో తనను కాల్చుతాడేమో అనే భయంతో బాత్రూమ్‌లో దాక్కున్నట్లు వెల్లడించాడు. దీంతో అందరూ కిటికీలు మూసేసి.. కిందికి వంగి ఉండాలని తాను సూచించినట్లు చెప్పాడు. అదే సమయంలో తనకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో తాను బయటికి వచ్చానని.. అప్పుడు రైలు పట్టాలపై తుపాకీతో చేతన్ సింగ్ బయల్దేరాడని వివరించాడు. 15 తర్వాత రైలు బయల్దేరిందని.. లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురు ప్రయాణికులు రక్తం మడుగులో పడి ఉన్నారని తెలిపారు. ఇక బోరివలి స్టేషన్‌లో స్ట్రెచర్‌లతో రైల్వే సిబ్బంది సిద్ధంగా ఉన్నారని.. అక్కడ వారు చనిపోయినట్లు ధ్రువీకరించినట్లు వివరించారు.
ఘటన తర్వాత చేతన్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించాడని.. అయితే రైల్వే సిబ్బంది పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు సాగుతోందని ఉన్నతాధికారులు వివరించారు. చేతన్ సింగ్‌కు షార్ట్ టెంపర్ ఉందని.. అతను చాలా కోపంతో సహనం కోల్పోయి ఉన్నతాధికారిని కాల్చి చంపినట్లు తెలిపారు. ఆ ఘటనను చూసిన ప్రయాణికులపైనా కాల్పులు జరిపాడని పశ్చిమ రైల్వే ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ సిన్హా వెల్లడించారు.