చంద్రబాబు నాయుడు రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ముగించి వెళ్లేముందు టీడీపీ హయాంలో సీమకు చేసిన అవమానాలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి వెళ్లిపో అని చెప్పానని, ఇప్పుడు ఆయన తండ్రి చంద్రబాబుకు కూడా అదే చెబుతున్నామన్నారు. చంద్రబాబు తీరు కన్నతల్లికి చీరపెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడన్న చందంగా ఉంటుందని గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెప్పేవారన్నారు. ప్రాజెక్టుల గురించి అవగాహన లేని వ్యక్తి, ఏ రోజూ ఇరిగేషన్‌పై ఆలోచన చేయని వ్యక్తి, ఏ ప్రాజెక్టును డిజైన్ చేయని వ్యక్తి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు.