ఇటీవల తెలంగాణలోని అభివృద్ది గురించి పరోక్షంగా ప్రశంసిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా మరోసారి ఏపీ, తెలంగాణను పోల్చారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏపీ నార్త్ కొరియాలాగా మారుతుందని, తెలంగాణ సౌత్ కొరియా అవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలకడంపై స్పందించారు. కోకాపేటలో ఎకరా భూమి వంద కోట్లు పలుకుతుందని, ఏపీలో కూడా తాను అదే చేయాలనుకున్నట్లు చెప్పారు. మీరంతా సైకోకు సహకరించారని, భూమి విలువ బాగా పడిపోయిందన్నారు. హైదరాబాద్, తెలంగాణకి సరిసమానంగా ఏపీని తయారు చేయాలని ప్రణాళికలు రూపొందించానని తెలిపారు.
రెండు రోజులుగా రాయలసీమలో పర్యటిస్తూ సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు.. ఇవాళ శ్రీకాళహస్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుర్మార్గుడు జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే మీ ఆస్తి కూడా మీకు ఉండదని, వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. పుంగనూరు వద్ద తనపై జరిగిన రాళ్ల దాడి ప్రజాస్వామ్యం, ప్రజలపై దాడి లాంటిదిని విమర్శించారు, ఇలాగే ఉంటే మరికొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా, తెలంగాణ సౌత్ కొరియాలా తయారవుతుందన్నారు.
ఈ సభలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి గోపాల కృష్ణారెడ్డి తనకు పరిచయమని, ఆయన నమ్మకానికి మారుపేరు అని అభివర్ణించారు. శ్రీకాళహస్తిలో పర్యటిస్తుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయని, గోపాల కృష్ణారెడ్డి ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారి హైటెక్ సిటీ కట్టామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి ఒక సైకో అని, ఇక్కడ ఆయన దౌర్జన్యం, దోపిడి ఏంటి..? అని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ అంటే బియ్యపు మధుసూదన్ రెడ్డి భుజాల తడుముకుంటారని, ఇక్కడ కలెక్టర్, ఎస్పీని అడుగుతున్నా 'సైకో' అని పిలిస్తే మీకేం ప్రాబ్లం అని మండిపడ్డారు.
రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంటే ఎస్పీలు కూడా సైకోలుగా తయారవుతారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. బియ్యపు రెడ్డి లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదన్నారు. ఢిల్లీ, గురుగ్రాం తర్వాత ఎక్కువ సెల్‌ఫోన్ తయారీ కేంద్రాలను రేణిగుంటకు తీసుకొచ్చానని, శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చానన్నారు. హీరో మోటార్స్, అపోలో టైర్స్ తీసుకొచ్చానన్నారు. అనంతపురంలో కియా మోటార్స్‌ను తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అని ముద్దు పెట్టగానే మత్తులో పడ్డారని అన్నారు. శ్రీకాళహస్తిలో నీళ్లు వస్తే బ్రహ్మాండమైన ప్రగతి వస్తుందని, ఎన్టీఆర్ మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడే రాళ్ల సీమగా మారిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కంకణం కట్టారని అన్నారు.