జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్లను టార్గెట్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు పోటీగా వాలంటీర్ వ్యవస్థను నడుపుతున్నారని, వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్లు పనిచేస్తున్నారని విమర్శలు కురిపించారు. గతంలో ఉభయగోదావరి జిల్లాలో జరిగిన వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కుదిపేశాయి. ఈ క్రమంలో మరోసారి వాలంటీర్లను పవన్ మరోసారి టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో 'జనసేన పార్టీ తీర్మానం-పంచాయతీలను కాపాడుకుందాం' అనే అంశంపై ఇవాళ చర్చాగోష్టి జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వాలంటీర్ల ద్వారా సర్పంచ్‌ల అధికారాలను లాక్కున్నారని, సర్పంచ్‌లకు ఎన్నికలు పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటున్నారని విమర్శించారు.
అధికార మదంతో అడ్డగోలుగా పని చేయకూడదని, ఏకగ్రీవాలకు జనసేన వ్యతిరేకమన్నారు. దీనిపై కేంద్రం చట్టం చేయాలని కోరుతున్నానని, కొన్నిచోట్ల పోటీ చేసిన వాళ్లను భయపెట్టి హింసించారన్నారు. ఒకచోట ఏకంగా అభ్యర్థిని చంపేశారని, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కు కాలరాసే హక్కు సీఎంకు కూడా లేదన్నారు.
సర్పంచ్‌లకు సంపూర్ణంగా చెక్ పవర్ ఉండాలని, డబ్బులు పెట్టి, కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే సర్పంచ్‌లకు హక్కులు లేవా? అని ప్రశ్నించారు. న్యాయం అడిగితే పోలీసులతో అరెస్టులు, కేసులా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా గ్రామీణాభివృద్ధి కోసం పోరాటం చేయాలని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసేలా జనసేన మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. గాంధీజి వంటి వారికే విమర్శలు తప్పలేదని, తాను అన్నీ తట్టుకునేందుకు సిద్దమై రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. కేంద్రం ఎన్ని నిధులు పంపినా అవి దుర్వినియోగం అయిపోతున్నాయని పవన్ విమర్శించారు.
'అధికారం ఉంది కదా అని పంచాయతీల డబ్బు దొంగతనం చేస్తారా? అటువంటి వారిని దొంగలు అనకుండా ఏమంటారు? వాలంటీర్ వ్యవస్థపై సర్పంచ్‌లు దృష్టి పెట్టాలని, మీకు మూడు వేలు... వాలంటీర్లకు ఐదు వేలా? మీ హక్కులు, అధికారాలు లాక్కుంటారా? వాలంటీర్ వ్యవస్థలో లోపాలపై అందరూ అధ్యయనం చేయండి.. భవిష్యత్తులో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగు వేద్దాం' అని పవన్ పిలుపునిచ్చారు. కాగా ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు సేకరిస్తున్నారని, ఆ సమాచారం విద్రోహ శక్తులకు చేరుతుందని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గ్రామ వాలంటీర్ల సమాచారం అసాంఘిక శక్తులకు చేరడం వల్లే మహిళలు మిస్ అవుతున్నారని ఆరోపించారు.