పుంగనూరు దాడుల ఘటన ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఈ అల్లర్ల అంశంపై అధికార వైపీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. విధ్వంసానికి మీరంటే మీరు కారణమంటూ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే దాడులు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. ప్రభుత్వమే ప్లాన్ చేసి చేయించిందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. దీంతో పుంగనూరు రణరంగం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది.
పుంగనూరు ఘటనలో ఇప్పటికే పలువురి టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి తానేటి వనిత కీలక ప్రకటన చేశారు. పుంగనూరు దాడులకు సంబంధించి చంద్రబాబుపై కూడా కేసు నమోదు చేస్తామని, ఏ1గా ఆయనను చేర్చుతామని వెల్లడించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసానికి బాబు కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా అప్పటికప్పుడు వేరే రూట్‌ను చంద్రబాబు ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం దారుణమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు తీరు ఉందని, ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తానేటి వనిత తెలిపారు. పోలీసులపై దాడి చేయడానికి అప్పటికప్పుడు బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో 50 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడుల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, విచారణలో అసలు విషయాలు తేలుస్తాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నా పోలీసులు సంయమనం పాటించారన్నారు. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే పుంగనూరు ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 128బీతో పాటు 332,353,147,148 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ ఘటనపై టీడీపీ కూడా సీరియస్ అయింది. గవర్నర్, ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసింది. సీఎం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్సీకి లేఖ రాసింది. కానీ ఇప్పటివరకు ఎన్‌హెచ్‌ఆర్సీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళనలు చేపడుతోంది.