వారం రోజుల కిందట బెంగళూరులో మచిలీపట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఆత్యహత్యల వెనుక కారణాలను కర్ణాటక పోలీసులు గుర్తించారు. సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంట్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరాంజనేయ విజయ్ (31), ఆయన భార్య హైమావతి (29), వారి ఇద్దరి పిల్లలు మోక్ష (18 నెలలు), సృష్టి (6 నెలలు) జులై 31న విగతజీవులుగా కనిపించారు. బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, షేర్ మార్కెట్‌లో నష్టపోయి.. ఉన్న డబ్బంతా పోగొట్టుకున్న విజయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది.
భార్యతోపాటు కుమార్తెలు మోక్ష, సృష్టిని గొంతునులిమి చంపేసి.. చివరగా తాను ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు బెంగళూరు డీసీపీ లక్ష్మణ్ ధ్రువీకరించారు. ఓ ఐటీ కంపెనీలో టీంలీడర్‌గా పనిచేస్తున్న విజయ్ ల్యాప్‌టాప్‌ను దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిశీలించారు. షేర్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు గుర్తించారు. ఆ బాధతోనే కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ముందు కుటుంబసభ్యుల గొంతులు నులిమి కడతేర్చినట్లు ఫోరెన్సిక్ నిపుణులు అనుమానిస్తున్నారు.
కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో.. శనివారం మచిలీపట్నం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఏడాదిన్నర వయసున్న పెద్ద కుమార్తె మోక్షకు కొద్ది నెలల కిందటే పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కారణాలు ఏవైనా.. తమతోపాటు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలనూ బలిగొనడం ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తోంది.
హైమావతి సోదరుడు ఆమెకు మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దీంతో అతడు ఆగస్టు 3న... గురువారం బెంగళూరుకు పయనమై.. వారు ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ అద్దం పగలకొట్టి లోపలకు చూడగా వీరాంజనేయ విజయ్ ఉరివేసుకున్న స్థితిలో కన్పించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించగా... అతడితో పాటు భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా ఉండటాన్ని గుర్తించారు.