ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి,,,రేపు అకౌంట్లోకి కల్యాణ మస్తు, షాదీ తోఫా డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 10:48 PM

 కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోపా మూడో విడత ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు ఆర్ధిక సాయం ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లో జమ చేయనున్నారు.


కులాంతర వివాహాం చేసుకున్న వారికి పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనుండగా.. మిగతా లబ్ధిదారులకు తల్లుల అకౌంట్‌లో వేయనుంది. మంగళవారమే ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా.. వరద బాధితులను పరామర్శించేందుకు గత రెండు రోజులుగా వివిధ జిల్లాల్లో జగన్ పర్యటిస్తున్నారు. దీంతో 9వ తేదీకి కార్యక్రమాన్ని వాయిదా వేశారు.


ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలు వివాహం చేసుకుంటే ఆర్ధిక సాయం అందిస్తుంది. ఎస్సీలకు రూ.లక్ష, ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.లక్షా 20 వేలు, ఎస్టీలకు రూ.లక్ష, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.లక్షా 20 వేలు, బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.75 వేలు, మైనార్టీలకు రూ.లక్ష సాయం అందిస్తుంది. ఇక విభిన్న ప్రతిభావంతులకు రూ.లక్షా 50 వేలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోనివారికి రూ.40 వేలు వైఎస్సార్ కల్యాణ్ మస్తు, షాదీ తోఫా పథకం కింద సాయం చేస్తోంది.


ఈ పథకంలో లబ్ది పొందాలంటే వధూవరులిద్దరూ తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. వివాహమైన తర్వాత 30 రోజుల్లోగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులకు సాయం అందిస్తూ వస్తుంది. ఇప్పటివరకు రెండో విడతల సాయం అందించగా.. ఇప్పుడు మూడో విడత సాయం ఇస్తోంది. పేదింటి పిల్లల వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదాా ఇతర ఆధారాలు అందించాల్సి ఉంటుంది. గత చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఈ పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పథకాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీ సర్కార్ ఆర్థిక సాయాన్ని మరింత పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com