అమరావతిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టును ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ న్యాయ పోరాటం చేయనుంది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల ఈడబ్ల్యూఎస్ కేటగిరి ఇళ్ల పట్టాలను పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిల్లో ఇళ్ల నిర్మాణాలకు కొద్దిరోజుల క్రితం జగన్ శంకుస్థాపన చేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలను వెంటనే ఆపేయాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల తెలిపారు. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు డైరీ నెంబర్‌ను కేటాయించారు.
వచ్చే శుక్రవారం లేదా శనివారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశాముందని తెలుస్తోంది. అయితే ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హైకోర్టులో పలు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిర్మాణాలను వెంటనే ఆపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీలోని ఆర్-5 జోన్ అంశం గత కొంతకాలంగా వివాదం రేపుతూనే ఉంది.