మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాకు టికెట్ల రేటును పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టికెట్ల రేటును పెంచుకునేందుకు ఆమోదం లభించలేదు. ఈ నెల 11న సినిమా విడుదల కానుండగా.. రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల సినిమా యూనిట్ దరఖాస్తు చేసుకుంది. కానీ ఇప్పటివరకు ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
దరఖాస్తులో సరైన వివరాలు పొందుపర్చలేదని, మరిన్ని వివరాలు కావాలని ప్రభుత్వం కోరుతోంది. దీంతో ప్రభుత్వం నుంచి అనుమతి రావడంపై సినిమా యూనిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఇటీవల చిత్ర యూనిట్ దరఖాస్తు చేసుకోగా.. ఏపీ ప్రభుత్వం తిరస్కరించిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ టార్గెట్‌గా చిరంజీవి విమర్శలు చేసిన నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా జరుగుతోంది. ఈ ఊహాగానాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టికెట్ల రేటు పెంచుకోడం కోసం చిత్ర బృందం దరఖాస్తు చేసుకుందని, కానీ దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలు అందించాల్సిందిగా సినిమా యూనిట్‌ను కోరామని, నిబంధనల ప్రకారం బడ్జెట్‌కు సంబంధించిన అన్నీ పత్రాలు సమర్పిస్తే అనుమతి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌కు సంబంధించి గైడ్‌లైన్స్ ప్రకారం అదనపు వివరాలు కావాలని కోరామని, అవి తమకు సమర్పిస్తే పరిశీలించి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు అందించాలని చెప్పడం, చిరు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడుతుండటంతో.. అనుమతి వస్తుందా? లేదా? అనే దానిపై డైలమా నెలకొంది.
అయితే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మానేసి ఏపీ అభివృద్ది గురించి ఆలోచించాలని జగన్ ప్రభుత్వంపై చిరు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని చిరు చురకలు అంటించారు. ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని, అంతేకానీ సినిమా ఇండస్ట్రీ మీద పడితే ఏమొస్తుందని విమర్శించారు. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న చిరు.. ఒక్కసారిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిరు వ్యాఖ్యలకు మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తుండటంతో.. ఈ వివాదం మరింతగా పెరిగింది. ప్రభుత్వాన్ని చిరు విమర్శించడంతో భోళా శంకర్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడావనికి అనుమతి రాకపోవచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడున్నాయి.